కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం విడుదల చేసింది. ఒక గ్రామం నుంచి మరో గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకునేవారికి రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ప్రకారం రవాణా భత్యం విడుదల చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 1,776మందికి ఈ పథకం కింద రూ.1.06 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ మొదటివారంలోగా రవాణాభత్యం అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
9,10 తరగతి విద్యార్థులకు వర్తింపు
దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో రవాణా భత్యం అందించేందుకు ఉపాధ్యాయులు ఇటీవల వివరాలు సేకరించారు. ఇది వరకు 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే రవాణా భత్యం వర్తింపజేశారు. వచ్చే ఏడాది నుంచి 9,10 తరగతులవారికి సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వీరి వివరాలు సైతం సేకరించి ప్రతిపాదనలు పంపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థి ఇంటికి ప్రాథమిక పాఠశాల కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల 3 కి.మీ, ఉన్నత పాఠశాల 5కి.మీ దూరంలో ఉంటే రవాణా భత్యం అందిస్తారు. ఆటోలు, తదితర ప్రైవేటు వాహనాల్లో విద్యాలయాలకు వచ్చి వెళ్లేందుకు ఈ భత్యాన్ని చెల్లిస్తారు. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థులకు ఒక్కొక్కరికి నెలకు రూ.600 చొప్పున పది నెలలపాటు రూ.6వేలు, తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు సైతం ఇదే విధంగా వర్తింపజేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ డబ్బు విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మేరకు విద్యార్థి పూర్తి వివరాలు, బ్యాంకు ఖాతా సంఖ్య సమగ్రశిక్ష అభియాన్ ప్రాజెక్టు మండలి ఉన్నతాధికారులకు నివేదించారు.
రవాణా భత్యానికి అర్హులైన విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంజూరు
ఉమ్మడి జిల్లాలో 1,776 మందికి రూ.1.06 కోట్లు