గ్రామాల్లో పెద్దన్న పాత్ర పోషించాలి
కొత్తపల్లి(కరీంనగర్): గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజలతో సఖ్యతగా మెదులుతూ పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజెపీ సర్పంచ్‌లు గెలిచిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కరీంనగర్ సూర్యనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీ గెలిచిన గ్రామాల్లో మొదటి ప్రాధాన్యంగా ఊరికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్నారు. పీహెచ్‌సీలకు అవసరమైన వైద్య పరికరాలు అందిస్తానన్నారు. సర్కారు స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇతర సర్పంచ్‌లకు ఆదర్శంగా బీజేపీ సర్పంచులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌కు ఒక్కసీటు వచ్చే పరిస్థితి లేదని తెలిసే, గెలిచిన వాళ్లంతా కాంగ్రెసోళ్లేనని గంప కింద కమ్మేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులంతా గెలిపించుకునేందుకు పార్లమెంట్‌కు వెళ్లకుండా అమిత్‌షా నుంచి అనుమతి తీసుకుని కరీంనగర్‌లో మకాం వేశానని, కొంత మంది కార్యకర్తలు పోటీ చేయాలంటే నామినేషన్ వేయడానికి కూడా పైసల్లేని పరిస్థితుల్లో 500 పంచాయతీల్లో పోటీ చేసి బీజేపీ ఉనికి చాటిందన్నారు. కరీంనగర్ ఇన్‌చార్జి డాక్టర్ మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


