క్రీస్తు జననం.. ఎల్లజనుల ఆనందం
● అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ప్రత్యేక ప్రార్థనలు ● నగరంలోని చర్చిల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
కరీంనగర్‌కల్చరల్: లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జిల్లాకేంద్రంలోని అన్ని చర్చిల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభించారు. మందిరాలను విద్యుత్ దీపాలు, క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, బెలూన్లతో అలంకరించారు. నగరంలోని సెయింట్ జాన్స్ స్కూల్ పక్కన గల లూర్థూమాత మందిరంలో రోమన్ కాథిలిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఫాదర్ తుమ్మ సంతోష్‌కుమార్ దైవ సందేశాన్ని వినిపించారు. క్యారల్స్‌బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. సీఎస్‌ఐ వెస్లీ కేథడ్రల్ చర్చి, సీఎస్‌ఐ సెంటినరీ వెస్లీ చర్చిలోనూ తెల్లవార్లూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు దక్షిణ ఇండియా సంఘం కరీంనగర్ అధ్యక్ష మండలం మోడరేటర్ దిమోస్ట్ రెవ కె.రూబెన్ మార్క్ ఆధ్వర్యంలో కోర్టు సర్కిల్ నుంచి గీతాభవన్‌చౌరస్తా వరకు శాంతి యాత్ర నిర్వహించారు. రెవ జాన్, రెవ సి.రాములు ఇమ్మాన్యుయేల్, రెవ పాల్ కోమల్, పాస్టర్లు తిమోతి, డేవిడ్, జార్జ్ డేవిడ్, క్రిస్టోఫర్, సత్యానందం, బొబ్బిలి విక్టర్ తదితరులు పాల్గొన్నారు.


