వెంకన్న ‘ముక్కోటి’ ఉత్సవాలకు హాజరుకండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు హాజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆలయ కమిటీ సభ్యులు కోరారు. బుధవారం హుస్నాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. ఉత్సవాలకు హాజరవుతానని మంత్రి హామీ ఇచ్చినట్లు కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ధర్మకర్తలు పూల లచ్చిరెడ్డి, శేషం నర్సింహాచార్యులు, జీల సంపత్, ఎనగందుల లక్ష్మణ్, దుబాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: సీపీఐ ఆవిర్భవించి డిసెంబర్ 26నాటికి 100 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఖమ్మంలో 2026 జనవరి 18న నిర్వహంచతలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ నగరంలోని కట్టారాంపూర్‌లో సీపీఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. వందేళ్లుగా సుదీర్ఘ ఉద్యమాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. పార్టీ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపెల్లి రాజు, కసిరెడ్డి, మణికంఠరెడ్డి, కసిబోజుల సంతోష్‌చారి పాల్గొన్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,450
జమ్మికుంట: స్థానిక వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,450 పలికింది. బుధవారం 253 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,350, కనిష్ట ధర రూ.7,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. గురువారం నుంచి ఆదివారం వరకు మార్కెట్‌కు సెలవులు ఉంటాయని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
వోఅండ్‌ఎం సిబ్బందికి పదోన్నతి
కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని పలువురు వోఅండ్‌ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ సీఎండీ ఉత్తర్వులు జారీ చేయగా ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు వారికి పోస్టింగ్‌లు కేటాయించారు. ముగ్గురు సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లకు ఫోర్‌మెన్ గ్రేడ్–1గా, ఆరుగురు లైన్ ఇన్‌స్పెక్టర్లకు సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లుగా, ఫోర్‌మెన్ గ్రేడ్–4ను ఇన్‌చార్జి ఫోర్‌మెన్ గ్రేడ్–2గా పోస్టింగ్ ఇస్తూ ఎస్‌ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రాన్స్‌జెండర్లకు పునరావాస పథకం
కరీంనగర్ టౌన్: జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు ఆర్థిక పునరవాస పథకం కింద రూ.75 వేల చొప్పున 3 యూనిట్లకు రూ.2,25000 ప్రభుత్వం 100శాతం సబ్సిడీతో కేటాయించినట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి తెలిపారు. ఈ మూడు యూనిట్లకు జిల్లాలో అర్హులైన ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు తగిన ధృవపత్రాలతో ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55ఏళ్ల వయసువారు అర్హులని, కలెక్టర్ జారీ చేసిన గుర్తింపు కార్డు ఉండాలన్నారు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించరాదన్నారు. అభ్యర్థులు ఐదేళ్లలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీ పొంది ఉండకూడదని, ఏదైనా యూనిట్ కోసం శిక్షణ పొందిన అభ్యర్థికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తిగల వారు తగిన ధ్రువీకరణపత్రాలు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వెంకన్న ‘ముక్కోటి’ ఉత్సవాలకు హాజరుకండి


