పతుల పెత్తనానికి చెక్‌ | - | Sakshi
Sakshi News home page

పతుల పెత్తనానికి చెక్‌

Dec 25 2025 8:29 AM | Updated on Dec 25 2025 8:29 AM

పతుల పెత్తనానికి చెక్‌

పతుల పెత్తనానికి చెక్‌

మహిళా సర్పంచ్‌ల విధుల్లో జోక్యం కుదరదు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

జిల్లాలో 158 మహిళా సర్పంచ్‌లు

1,483 మంది వార్డు సభ్యులు

కరీంనగర్‌రూరల్‌: గ్రామపంచాయతీ పరిపాలన వ్యవహారాల్లో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్‌ పెట్టింది. సర్పంచులుగా సతుల విధుల్లో పతులతో పాటు కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. గ్రామాల్లో గెలిచిన మహిళా సర్పంచులకు బదులుగా భర్తలు, కొడుకులు, కుటుంబసభ్యులు అధికారం చెలాయించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 22న జరిగిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో సైతం కొన్ని గ్రామాల్లో భార్యలకు బదులుగా భర్తలు ప్రమాణం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం మెమో నంబరు–3,292 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీతో పాటు మండల పరిషత్‌, జెడ్పీలకు సైతం ఈ ఉత్వర్వులు వర్తింపచేయాలని సూచించింది.

స్థ్ధానికసంస్థల్లో సగం సీట్లు మహిళలకే

పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పించారు. జిల్లాలో 316 సర్పంచు స్థానాలకు మహిళలకు 158, మొత్తం 2,946 వార్డు స్థానాలకు 1,483 కేటాయించారు. రిజర్వేషన్‌ ప్రకారం ఎస్సీలకు 80 సర్పంచ్‌ స్థానాలు కేటాయిస్తే మహిళలకు 40స్థానాలు, బీసీలకు 73 స్థానాలిస్తే 37, మిగితా 163 జనరల్‌ స్థానాల్లో 81 మహిళలకు కేటాయించారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎ న్నికల్లో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 1,641 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జనరల్‌ స్ధానాల్లో సైతం మహిళలు పోటీచేసి సర్పంచులు, వార్డుసభ్యులుగా గెలుపొందారు.

ఆచరణలో అమలయ్యేనా?

మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబసభ్యుల పెత్తనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకాలేదు. గత పాలకవర్గంలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులస్థానంలో భర్తలు పాలన సాగించిన ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం భార్యలకు బదులుగా భర్తలకే ప్రాధాన్యత ఇవ్వడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. కరీంనగర్‌రూరల్‌ మండలంలోని ఓ పంచాయతీలో మహిళా సర్పంచ్‌కు బదులుగా భర్త అధికారం చెలాయించడంతోపాటు వేధింపులు భరించలేక కార్యదర్శులు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వుతో మార్పు వస్తుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల మార్కు కనిపిస్తుందని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement