కబడ్డీ.. కబడ్డీ
కరీంనగర్‌స్పోర్ట్స్: కబడ్డీ.. కబడ్డీ.. కూత రేపటినుంచి నగరంలో హోరెత్తనుంది. రాష్ట్రస్థాయి కబడ్డీపోటీలకు కరీంనగర్ వేదికై ంది. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు అంబేద్కర్‌స్టేడియంలోని హాకీ మైదానంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు జరుగనున్నాయి. 17ఏళ్ల తరువాత రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతున్నాయి. పోటీలకు రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నారు. పురుషులు, మహిళల విభాగంలో 32 జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి 2 జట్లు హాజరుకానున్నాయి. మొత్తంగా 34 చొప్పున పురుషుల, మహిళల జట్లు ట్రోపీ కోసం పోటీపడనున్నాయి. 952 మంది క్రీడాకారులు, 156 మంది కోచ్, మేనేజర్లు, 100 మంది రెఫరీలు, 40 మంది కబడ్డీ సంఘం ప్రతినిధులు హాజరుకానున్నారు. క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించనున్నారు.
ఆస్ట్రో టర్ఫ్ కోర్టులపై ఆట
అంబేద్కర్ స్టేడియంలోని హాకీ మైదానాన్ని రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్‌లో తొలిసారిగా ఆస్ట్రోటర్ఫ్ కోర్టులపై కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. గతంలో ఇదే స్టేడియంలోని ఇండోర్‌హాల్‌లో కబడ్డీ ప్రీమీయర్ లీగ్ నిర్వహించారు. ఈసారి ఆరు కోర్టులు సిద్ధం చేస్తున్నారు.
మంత్రులతో ప్రారంభం
17 ఏళ్ల తరువాత కరీంనగర్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్, సీపీ, మున్సిపల్ కమిషనర్ హాజరుకానున్నట్లు కబడ్డీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు తెలిపారు. 28న జరిగే ముగింపు పోటీలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు.
8 చొప్పున పూల్‌లు.. 142 మ్యాచ్‌లు
అంబేద్కర్ స్టేడియంలో నాలుగు రోజులు కబడ్డీ కూత మోగనుంది. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలు జరగనున్నాయి. మహిళలు, పురుషుల జట్లను 8 విభాగాల చొప్పున మొత్తం 16 గ్రూప్‌లుగా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. మొత్తంగా 142 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాణించిన క్రీడాకారులను రాష్ట్ర జట్లకు ఎంపికచేసి, 72వ జాతీయస్థాయి సీనియర్స్ పోటీలకు పంపనున్నారు. మహిళల జాతీయ కబడ్డీ పోటీలు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరగనుండగా, పురుషుల పోటీలు గుజరాత్‌లో ఫిబ్రవరి 24 నుంచి 27వరకు జరగనున్నాయి.
కరీంనగర్ జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జరిగే 72వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా కబడ్డీ సంఘం చీఫ్ పాటర్న్, పారమిత విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఈ.ప్రసాద్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో పోటీల వివరాలు వెల్లడించారు. కరీంనగర్ వేదికగా 17ఏళ్ల అనంతరం కబడ్డీలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ అమిత్ కుమార్, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్‌రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్‌గౌడ్, పారమిత విద్యాసంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, కబడ్డీ సంఘం కోశాధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
రేపటి నుంచి కరీంనగర్ వేదికగా రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు
33 జిల్లాల నుంచి హాజరుకానున్న క్రీడాకారులు
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కబడ్డీ సంఘం
కబడ్డీ.. కబడ్డీ
కబడ్డీ.. కబడ్డీ


