వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చితేనే రైతులకు మనుగడ సాధ్యమని పలువురు వక్తలు అన్నారు. జగిత్యాలరూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో మంగళవారం జాతీయ రైతు సదస్సు నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయంలోనూ ఇతర దేశాలతో పోటీపడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. మనం పండించిన పంటల్లో రసాయనాల శాతం అధికంగా ఉండటంతో అమెరికా వంటి చాలా దేశాలు మన ఉత్పత్తులను తిరస్కరిస్తున్నాయని తెలిపారు. సహకార సంఘాలు, ఎఫ్‌పీఓ సంఘాలు సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రతి పంటకూ ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. రైతు భూసార పరీక్షలు చేయించుకుని, ఆ మేరకు రసాయన ఎరువులు వాడాలన్నారు. వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. మానవ రహిత వ్యవసాయం చేసేందుకు వర్సిటీ పరిధిలో రోబోటిక్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ మాట్లాడుతూ.. మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంటల సరళి మార్చాలన్నారు. వరి పంటల్లో యాజమాన్య పద్ధతులపై శ్రీనివాస్, నూతన వరి రకాలపై సతీష్‌చంద్ర, యాసంగి పంటల్లో వచ్చే తెగుళ్లపై ఎన్.సుమలత, పంటల్లో యాజమాన్య పద్ధతులపై వై.స్వాతి, రవి, మామిడి పంటపై కె.స్వాతి, రబీలో జింక్‌లోపంపై సాయినాథ్ వివరించారు. కోతుల బెడదతో వ్యవసాయం చేయలేకపోతున్నామని, రైతులకు అవసరమైన విషయాలపైనే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని రైతులు కోరారు. ఉత్తర తెలంగాణలోని వ్యవసాయ పరిశోధన స్థానాల శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న రకాలను ప్రదర్శనగా పెట్టారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్, పొలాస సర్పంచ్ శంకరయ్య పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, హాజరైన వివిధ జిల్లాల రైతులు
రైతు వ్యాపారిలా ఆలోచించాలి
అప్పుడే అన్నదాతలకు మనుగడ
పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో జాతీయ రైతు సదస్సు
పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు
అలరించిన స్టాళ్లు
వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చాలి


