మా బతుకులు మారవా..?
● సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన
● జీతం చారెడు.. పని బారెడు
● అరకొర వేతనాలతో ఇబ్బందులు
కరీంనగర్‌టౌన్: జిల్లా విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా పథకంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న 1,993 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విద్యాభివృద్ధికి కృషిచేస్తున్నా ప్రభుత్వాలు తమపై చిన్నచూపు చూస్తున్నాయని వాపోతున్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోమార్లు చర్చలకు పిలిచినా ఫలితం లేకపోయిందని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే సచివాలయానికి పిలిచి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడిచినా నేటికీ నెరవేరకపోవడంతో తమ పరిస్థితి ముందు నొయ్యి.. వెనుక గొయ్యిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 1,993 మంది ఉద్యోగులు
ఉమ్మడి జిల్లాలో సమగ్ర శిక్షా విభాగంలో వివిధ కేటగిరీల్లో 1,993 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 560 మంది, కరీంనగర్‌లో 560, పెద్దపల్లిలో 428, రాజన్నసిరిసిల్లలో 445 మంది ఉన్నారు. కేజీబీవీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, యూఆర్‌ఎస్ పాఠశాలల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, డీపీవో కాంట్రాక్ట్ స్టాఫ్, ఎంఐఎస్ కో ఆర్డినేటర్, ఎంఆర్‌సీ కంప్యూటర్ ఆపరేటర్స్, భవిత సెంటర్లలో ఐఈఆర్పీలు, సీర్‌పీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, పార్ట్ టైం ఇన్‌స్ట్రక్టర్లు ఎంఆర్‌సీ మెసెంజర్లుగా, వాచ్‌మెన్లుగా, స్కావెంజర్, కుక్స్‌గా వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగ భద్రత కరువు
విధి నిర్వహణలో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు రోడ్డు ప్రమాదాలు జరిగి, ఇతరకారణాల వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు మరణిస్తే ప్రభుత్వం నేటి వరకు ఏ ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న విధంగా తెలంగాణలో కూడా టీఏ, డీఏలు ఇస్తూ ఉద్యోగ భద్రత, తదితర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు, ప్రభుత్వ పెద్దలకు విన్నవించుకుంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో మొండిచేయి
ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, గతంలో ఉన్నత విద్యాశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లను క్రమబద్ధీకరించిన ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపుతోందన్నారు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ నియామకాలకు సరిపోయే విద్యార్హతలు ఉన్నా వెయిటేజీ ఇవ్వకపోవడంతో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.


