సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Aug 1 2026 12:54 AM | Updated on Aug 1 2026 12:54 AM

గొడవలొద్దు గ్రామాభివృద్ధికి కృషి చేయండి

మాచారెడ్డి: గొడవలు పరస్పర దూషణలకు స్వస్తి చెప్పి గ్రామాభివృద్ధికి కలిసి కృషి చేయాలని కామారెడ్డి డీఎల్‌పీవో శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని గజ్యా నాయక్‌ తండా జీపీ పాలక వర్గంలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పలువురు వార్డు సభ్యుల మధ్య సమన్వయం లోపించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా పరస్పర ఫిర్యాదు లు చేసుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ భర్త పెత్తనాన్ని నిరసిస్తూ గురువారం జరిగిన జలసిరి గ్రామసభను ఎనిమిది మంది వార్డు సభ్యులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఎల్‌ పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో గోపి బాబు, ఎంపీవో ప్రవీణ్‌,పంచాయతీ కార్యదర్శి దర్శన్‌ శుక్రవారం ఇరువర్గాలను విచారించారు. ఇరువర్గాల వాదనలను జిల్లా కలెక్టర్‌ కు నివేదిస్తానన్నారు.

వార్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి

మాచారెడ్డి: మహిళ సర్పంచ్‌ అని చూడకుండా తనపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు సభ్యుడు కిషన్‌ పై చర్యలు తీసుకోవాలని గజ్యా నాయక్‌ తండా సర్పంచ్‌ రావుల వినోద డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గజ్యా నాయక్‌ తండా జీపీ లో విచారణ జరుపుతున్న అధికారుల ముందే తనపై అక్కసు వెళ్లగక్కాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు వార్డు సభ్యుడిపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. ఉప సర్పంచ్‌ బిక్షపతి,వార్డు సభ్యుడు ప్రకాష్‌,సర్పంచ్‌ భర్త ప్రభాకర్‌ ఉన్నారు.

వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

బాన్సువాడ : హలో బీసీ..చలో బెంగళూర్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను శుక్రవారం బాన్సువాడలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వనం గంగాధర్‌ బీసీలను ఏకం చేసేందుకు ఆగస్టు 7న బెంగళూరులో జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, మహిళ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌ కోటా కల్పించాలని, జనాభా ప్రతిపాదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలని, చట్ట సభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవన్‌, రాజ్‌కుమార్‌, సాయిరాం, వెంకటేశ్‌, విజయ్‌, రాజు, అనిల్‌, గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ

భిక్కనూరు: మండల కేంద్రంలో నీలకంఠ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నీలకంఠ సంఘం మహిళలు వీధుల గుండా బోనాల ఊరేగింపు నిర్వహించారు. మహంకాళి, భూలక్ష్మి అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. అనంతరం మహిళలు అమ్మవార్లకు ఓడి బియ్యం పోసి కట్నకానుకలను సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.

చాముండేశ్వరి ఆలయానికి

రూ.18 వేలు విరాళం అందజేత

దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో సాలగ్రామ నిర్మాణానికి గ్రామానికి చెందిన అందె సన్నిత్‌కుమార్‌ శుక్రవారం రూ. 18 వేల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు శాలువాతో వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, దోమకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధ రాములు, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు అందె గణేశ్‌, ఆలయ అర్చకులు బావి శరత్‌చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు.

శబరిమాత ఆశ్రమంలో పల్లకీ సేవ

తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం పల్లకీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శబరిమాత దివ్యసమాధి వద్ద భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బాపురావు, సిద్దిరాంరెడ్డి, గంగారాం, నారాయణరెడ్డి, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఊరడమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తి

భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్‌ గ్రామంలో ఊరడమ్మ పండుగకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మ హంకాళి మాత ఆలయం ఉత్సవ కమిటీ ప్రతినిధు లు శుక్రవారం తెలిపారు. శనివారం గ్రామంలో ఊ రడమ్మ పండుగ, పోతరాజుచే గావు కార్యక్రమం, ఆదివారం మహంకాళి మాత బోనాల పండుగ, భవిష్యవాణి (రంగం) కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాలకు రావాలని హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీని కలిసి ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

మద్నూర్‌(జుక్కల్‌): రైతులు తప్పకుండా వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలను పాటించి అధిక దిగుబడులు పొందాలని మండల వ్యవసాయ అధికారి రాజు సూచించారు. మండల కేంద్రానికి సమీపంలోని శివారులో శుక్రవారం సోయాబీన్‌ పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం సోయాబీన్‌ పంటలో వేరు, కాండం కుళ్లు గమనించినట్లు ఏవో తెలిపారు. దీని నివారణకు కార్బండజిం, మ్యాన్కోజేబ్‌ 2 గ్రాములు లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. అలాగే పోషకలోపంతో మొక్క పైభాగంలో చిగురాకులు పసుపు రంగులో గమనించడం జరిగిందన్నారు. నివారణకు 13–0–45, 10 గ్రాము ఫార్ములా 4, 5 గ్రాము లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. యూరియా 25–30 కిలోలు ఎకరాకు పైపాటుగా వేసుకోవాలన్నారు. కాండపు ఈగ, కాండం తొలుచు ఈగ గమనిస్తే నివారణకు ఏసిఫేట్‌ 1.5 గ్రాము, లేదా తయోమితక్షం, లామ్దశహలోత్రిన్‌ 0.4 మీల్లీ లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు సౌమ్య, విశాల్‌, రజహిత, రైతులు పాల్గొన్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుపై రాయితీ గడువు పొడిగింపు

కామారెడ్డి టౌన్‌: మున్సిపాలిటీలలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుదారులకు ప్రభుత్వం, మున్సిపల్‌ శాఖ శుభవార్త తెలిపింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లింపులో 25 శాతం రాయితీ గడువు జూలై 31 వరకు ఉండగా, ఆ గడువును నవంబర్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు జీవో ఎంఎస్‌ నంబర్‌ 213 విడుదల చేసినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారి వినిత్‌ తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్‌లో 50శాతానికి పైగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనాధికారిక ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులు కోరారు.

వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో డాన్‌ టు డస్క్‌

భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో వాసవీ క్లబ్‌ ఆధ్వర్యంలో డాన్‌ టు డస్క్‌ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. గ్రామంలో మొక్కలను నాటి వాటికి ట్రీ గార్డులను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీని అందజేసి ప్రభుత్వ పాఠశాల్లో ప్రథమ చికిత్స కిట్లను అందజేశారు.

నోట్‌ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలి

తాడ్వాయి: పాఠశాలలో చదివే విద్యార్థులు నోట్‌ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు హన్మంత్‌రావు అన్నారు. మండలంలోని చిట్యాల, నందివాడ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు విద్యార్థులకు నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ఉన్నారు.

విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

లింగంపేట(ఎల్లారెడ్డి): బిగ్‌ ఫైల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ పోతాయిపల్లి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోతాయిపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నగదు బహుమతులను ఎంఈవో అంజల్‌రెడ్డి శుక్రవారం అందజేశారు. 2025–26 సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి విద్యార్థులకు మొదటి బహుమతి రూ.1000, ద్వితీయ బహుమతి రూ. 500, ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి రూ. 300, రూ. 200 చొప్పున అందజేసినట్లు తెలిపారు. సర్పంచ్‌, తదితరులున్నారు.

ఉత్తమ సేవలతోనే సమాజంలో గుర్తింపు

కామారెడ్డి రూరల్‌: ఉత్తమ సేవలతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎంఈవో ఎల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గర్గుల్‌ గ్రామంలో బయోలాజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడు సి దయానంద్‌ పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈవో మాట్లాడారు. పదవీ విరమణ పురస్కరించుకుని ఉపాధ్యాయుడు దయానంద్‌ పాఠశాలకు బియ్యం నిలువ చేసుకునేందుకు రూ. 12 వేల విలువైన స్టీల్‌ డబ్బాలను వితరణ చేశారు. హెచ్‌ఎం వై ఎల్లయ్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement