
మోసానికి గేట్‌వే!
వలువలు ఒలిచి.. ఖాతాలు కొల్లగొట్టి..
మోసగాళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అమాయకులకు వల వేస్తూ.. చిక్కినవారిని నిలువు దోపిడీ చేస్తున్నారు. అద్దెకు తెచ్చిన కార్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ.. ఆపై అదే కారును ఎత్తుకెళ్లి మోసాలకు పాల్పడుతున్న ముఠాను ఇటీవల జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్షిస్తూ, నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మరో ముఠా గుట్టూ రట్టు చేసిన ఉదంతమూ విదితమే.. అయితే ఈ కేసులో వందలాది మంది బాధితులున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గే యాప్స్ ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్శించి వారిని తమ దగ్గరకి రప్పించుకుని వారికి తెలియకుండా నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిలింగ్ దందా నడిపిన ముఠా సభ్యులు ఐదుగురిని ఈనెల 2న కామారెడ్డిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిపై ఇప్పటికే 11 కేసులు నమోదవగా.. బాధితులు నలభై మంది దాకా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇంకా వందల్లో ఉంటారని సమాచారం. బాధితుల్లో కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు చెందిన వారూ ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా కొందరు బాధితులు తమ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందన్న ఉద్దేశంతో బయటకు రావడం లేదు. మరికొందరు కుటుంబ సభ్యుల ముందు ఇబ్బందిపడొద్దని వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ కేసులో స్థానిక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రిమాండ్‌లో ఉన్న ముఠా సభ్యుల కస్టడీ కోసం పిటిషన్ వేసి వారిని మరింత లోతుగా విచారించే అవకాశాలున్నాయి.
ఇప్పటికే ఐదుగురు సభ్యులు గల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.. కేసులో మరింత లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ముందుగా బాధితుల వివరాలు సేకరించి వారి ద్వారా ఫిర్యాదులు తీసుకుని ఎంత నష్టపోయారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు యాభై మంది వరకు బాధితులను గుర్తించినట్లు సమాచారం. బాధితులు ఇంకా వందల్లో ఉంటారని భావిస్తున్నారు. కేసును మరింత లోతుగా విచారించేందుకు అరెస్టయిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ ముఠా సభ్యులు వివిధ యాప్‌ల ద్వారా స్వలింగ సంపర్కులను ఆకర్శిస్తారు. వారికి కామారెడ్డిలో తాము ఏర్పరచుకున్న స్థావరం లొకేషన్ పంపించి రప్పించుకుంటారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న గే.. వారిని రిసీవ్ చేసుకుని, సహకరిస్తూ బట్టలు విప్పించి న్యూడ్‌గా మారుస్తాడు. దీనిని ముఠా సభ్యులు ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. వచ్చిన వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుల్ని లాక్కుంటారు. అతడి బ్యాంకు ఖాతాలో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెక్ చేసి ఆ డబ్బునంతా తమకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటారు. కొందరిని తర్వాత కూడా ఫోన్ చేసి డబ్బులకోసం డిమాండ్ చేస్తున్నారని, లేదంటే న్యూడ్ వీడియోలు, ఫొటోలు బయటపెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ముఠా కార్యకలాపాలు నాలుగేళ్లుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్‌కు చెందినవారు కూడా ఎంతో మంది వీరి వలలో పడి డబ్బులు పోగొట్టుకున్నట్లు సమాచారం. అయితే బాధితులు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతున్నారు. ఓ బాధితుడు ధైర్యం చేసి పోలీసులకు వివరించడంతో ముఠా గుట్టు రట్టయ్యింది.
యాప్ ద్వారా స్వలింగ సంపర్కులకు వల
నగ్న వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్
రూ. లక్షలు వసూలు చేస్తున్న ముఠా
ఇప్పటికే ఐదుగురు నిందితుల అరెస్ట్
కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నాలు
బాధితుల గురించి ఆరా తీస్తున్న పోలీసులు