
క్రైం కార్నర్
సీపీ ఎదుట 13 మంది బైండోవర్
బోధన్‌టౌన్(బోధన్): వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ, దుర్గామాత ఉత్సవాల సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన 13 మందిని అదనపు జిల్లా మెజిస్ట్రేట్, సీపీ సాయిచైతన్య ఎదుట శనివారం బైండోవర్ చేశారు. వచ్చే ఆరు నెలలపాటు సత్ప్రవర్తన కలిగించేందుకు సొంత పూచీకత్తుతో బైండోవర్ చేసినట్లు సీపీ తెలిపారు. డీజే యజమానులు రూ.2 లక్షలు, డీజే ఆపరేటర్లు రూ.50 వేలు, ట్రబుల్ మాంగర్స్ రూ.లక్ష పూచీకత్తు చెల్లించినట్లు పేర్కొన్నారు. బైండోవర్ అయినవారు మళ్లీ నేరాలకు పాల్పడితే పూచీకత్తు డబ్బులను జప్తు చేస్తామన్నారు.
ఆర్మూర్‌టౌన్: హాస్టల్‌లో ఉంటూ చదువుకోవడం ఇష్టంలేక బయటికి వచ్చిన విద్యార్థిని పోలీసులు క్షేమంగా ఇంటికి చేర్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాల్కొండ మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి బాల్కొండలోని వసతిగృహంలో ఉంటూ చదువుతున్నాడు. శనివారం ఇంటి నుంచి బయల్దేరిన విద్యార్థి హాస్టల్‌కు వెళ్లకుండా పెర్కిట్ బస్టాండ్‌కు చేరుకున్నాడు. బస్టాండ్‌లో రోదిస్తూ కూర్చున్న విద్యార్థిని గమనించిన స్థానికులు ఆరా తీయగా బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సదరు విద్యార్థికి కౌన్సెలింగ్ చేసి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సమయానికి బస్టాండ్‌కు చేరుకొని విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడకుండా కాపాడిన శాంతికుమార్, దినేశ్‌లను ఎస్‌హెచ్‌వో అభినందించారు.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్‌పేట్ గ్రామంలో ఓ వివాహిత శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన వడ్డె పుష్ప(40) భర్త కిషన్, అతని కుటుంబసభ్యుల వేధింపులకు గురవుతూ వస్తుంది. దీంతో జీవితంపై విరక్తి చెంది పుష్ప ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, కుటుంబసభ్యుల వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం భర్త బతుకుదెరువు నిమిత్తం దుబాయిలో పనిచేస్తున్నాడు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

క్రైం కార్నర్