
వృద్ధుల రక్షణకో చట్టం
మీకు తెలుసా?
ఎల్లారెడ్డి: చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్య సమయంలో పిల్లలు భారంగా భావించి వదిలేస్తున్నారు. ఇలా దగ్గరి వాళ్లతో దగాపడ్డ తల్లిదండ్రులకు వయోవృద్ధుల నిర్వహణ, సంక్షేమ చట్టం –2007 రక్షణ కల్పిస్తోంది.
● చట్టం ప్రకారం పిల్లలు తమ తల్లిదండ్రులను పోషించేందుకు, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
● పిల్లలు నిర్లక్ష్యం చేస్తే తల్లిదండ్రులు వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు. వారి నుంచి భరణం లేదా సంరక్షణావ్యయం పొందేందుకు న్యాయస్థానం తలుపుతట్టవచ్చు.
● తల్లిదండ్రులకు ఆహారం, బస, దుస్తులు, వైద్య సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలను కచ్చితంగా సమకూర్చాలి.
● పిల్లలు మానసికంగా లేదా శారీరకంగా హింసిస్తే కోర్టు నేరంగా పరిగణించి తల్లిదండ్రులకు న్యాయం చేస్తుంది. తల్లిదండ్రులను పోషించడంలో విఫలమైతే కోర్టు పిల్లలకు జరిమానాతోపాటు జైలు శిక్ష విధిస్తుంది.
● నిరాదరణకు గురవుతున్న వయోవృద్ధుల కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్ కార్యాలయాలలో ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేస్తున్నారు. బాధితులు తెల్లకాగితంపై తమ సమస్యను వివరిస్తూ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకుంటే అధికారులు విచారణ జరిపి వారికి పోషణ, సంక్షేమం వచ్చేలా చర్యలు తీసుకుంటారు.