
కట్టుకున్నోడే కాలయముడయ్యాడు..
● అనుమానంతో భార్యాభర్తల
మధ్య తరచూ గొడవ
● మద్యం మత్తులో బండరాయితో
దాడి.. భార్య మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): కలకాలం వెన్నంటి ఉండి కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్తే కాలయముడయ్యాడు. భార్యను బండరాయితో మోది హతమార్చిన ఘటన మండల కేంద్రంలోని జ్యోతినగర్ కాలనీలో శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. జ్యోతినగర్ కాలనీకి చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ(40) వంట చేస్తుండగా భర్త రవి అతిగా మద్యం సేవించి గొడవపడ్డాడు. ఈ క్రమంలో భార్య, భర్తపై దాడి చేసింది. మద్యం మత్తులో ఉన్న రవి బండరాయితో తలపై దాడి చేయగా లింగవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. కాగా, అనుమానంతోనే ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవని కాలనీవాసులు తెలిపారు. మృతురాలికి కొడుకులు సురేశ్, మహేశ్ ఉన్నారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్ సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.