
‘నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి’
కామారెడ్డి క్రైం : వినాయక నవరాత్రులు, నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. గణేశ్ మండపాల నిర్వాహకులతో శనివారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మండపాల ఏర్పాటు, నిర్వహణ విషయంలో నిర్వాహకులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తప్పనిసరిగా పోలీసు శాఖ సూచించిన విధంగా ఆన్‌లైన్ ద్వారా వివరాలు సమర్పించి అనుమతులు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిబంధనలకు లోబడి కార్యక్రమాలు జరపాలని, పెట్రోలింగ్‌కు వచ్చే పోలీసులకు వలంటీర్లు సహకరించాలని పేర్కొన్నారు. మండపాల్లో ఏదైనా బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 డయల్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యుత్ షాక్‌లు జరుగకుండా నిపుణులైన ఎలక్ట్రీషియన్‌లతో ఏర్పాట్లు చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, రవాణా, ఎకై ్సజ్ శాఖల అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.