
ఉచిత బస్సు ప్రయాణం మాకొద్దు
కామారెడ్డి టౌన్ : ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రద్దు చేయాలని పలు వురు మహిళలు డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు బాజ లలిత ఆధ్వర్యంలో కామారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట బస్సులు బయటకు వెళ్లే దారిలో బైఠాయించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలతో పాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరిపడా బస్సులు లేక, కిక్కిరిసిన ప్రయాణికులతో ప్రయాణాలు చేయలేకపోతున్నామన్నారు. ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం.. ఈ పథకం ద్వారా మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు, వృద్ధులకు ఈ పథకం అమలు చేయాలని కోరారు. ఈ ఉచిత పథకం వల్ల ధరలు పెంచుతూ మళ్లీ పేద, మధ్యతరగతి వారికే భారం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
● కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట
మహిళల ధర్నా