
కొత్త సంఘాల ఏర్పాటు ఎప్పుడో?
ఎల్లారెడ్డి : సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాల నుంచి 60 ఏళ్లు నిండినవారిని తొలగిస్తున్నారు. సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలేమైనా ఉంటే వాటి రికవరీ పూర్తయ్యే వరకు సభ్యులుగా ఉంచి తర్వాత సభ్యత్వం రద్దు చేస్తున్నారు. వృద్ధ మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ కారణంతోనే వృద్ధులను మహిళా సంఘాలనుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో వేలాది మంది మహిళలు సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధిల నుంచి రుణాలను పొంది స్వయం ఉపాధి పొందుతున్నామని, ఇప్పుడు తమను సంఘాల నుంచి తొలగిస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమకు 60 ఏళ్లు లేకున్నా రికార్డులలో పొరపాట్ల వల్ల మహిళా సంఘాలనుంచి తొలగిస్తున్నారని పేర్కొంటున్నారు. కష్టపడి పనిచేసే ఓపిక ఉన్నా సభ్యత్వం రద్దు వల్ల తమ స్వయం ఉపాధి కోసం కావాల్సిన పెట్టుబడి లేక ఊరికే కూర్చోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తామని గతంలో సర్కారు ప్రకటించింది. ఇటీవల ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో వృద్ధులైన మహిళలతోపాటు కిశోర బాలికలకు వేర్వేరుగా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో 60 ఏళ్లు దాటిన మహిళల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే సీఎం ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు.
జిల్లాలో 70 వేల మంది..
జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం 17,243 స్వయం స హాయక సంఘాలున్నాయి. వీటిలో 1.75 లక్షల మంది సభ్యులున్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న మహిళలు 42,357 మంది, దివ్యాంగ పెన్షన్ పొందుతున్న మహిళలు 15,516 మంది, కిశోర బాలికలు 16 వేల వరకు ఉన్నారు. ఇందులో మహిళా సంఘాల సభ్యత్వానికి అర్హులైనవారి వివరాలు సేకరించాల్సి ఉంది. వీరందరికి సభ్యత్వం ఇవ్వాలనుకుంటే జిల్లాలో అదనంగా 7 వేల వరకు మహిళా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
మహిళా సంఘాల్లోంచి 60 ఏళ్లు
నిండినవారి తొలగింపు
వృద్ధులతోపాటు కిశోర బాలికలనూ చేర్పించాలన్న సర్కారు
జిల్లాలో సభ్యత్వం కోసం
ఎదురుచూస్తున్న 70 వేల మంది
స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 60 ఏళ్లు నిండినవారితోపాటు కిశోర బాలికలకు సభ్యత్వం ఇస్తామని ప్రకటించింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో జిల్లాలో సుమారు 70 వేల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు.