
విచ్చలవిడిగా జూదం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పేకాట ఎన్నో జీవితాలను బలితీసుకుంటోంది. సరదాగా మొదలైన ఆట వ్యసనంగా మారడంతో ఎంతో మంది అప్పులపాలై ఆస్తులు అమ్ముకున్నారు. కొందరైతే పొద్దస్తమానం పేక ముక్కలతోనే గడుపుతున్నారు. వ్యాపారం, వివిధ వృత్తుల్లో ఉన్నవారితో పాటు ఉద్యోగస్తులు సైతం అన్ని పనులు పక్కన పెట్టేసి పేకాడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పేకాటపై ఎస్పీ రాజేశ్ చంద్ర ఉక్కుపాదం మోపుతున్నా రోజుకో అడ్డాలో ఆట కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి సమాచారం తెలిసి పోలీసులు దాడులకు ఉపక్రమించేలోపు పేకాడేవారు అడ్డా మార్చేస్తున్నారు.
జిల్లాలో గతేడాది పేకాటకు సంబంధించి 207 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 1,160 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 40.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 103 కేసుల్లో 610 మంది అరెస్టయ్యారు. వారి వద్ద నుంచి రూ.11.49 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు దాడుల్లో దొరికినప్పటికీ నాలుగు రోజులకే తిరిగి ఆటలో లీనమవుతున్నారు. కొందరు పేకాటలో మునిగి తేలుతూ కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదు. రోజుల తరబడి ఇంటి ముఖం చూడని వారున్నారు.
ఎన్ని అడ్డాలో...
పేకాట ఆడేవారు తమ స్థాయిని బట్టి అడ్డాలు నిర్ణయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు బడాబాబులు పేకాడేందుకు ఇళ్లనే అడ్డాలుగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్తే.. అదే పేకాడ అడ్డా అవుతోంది. అలాగే కొందరు పెంట్ హౌజ్‌లను పేకాట కోసం వాడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్లను వ్యాపార కార్యకలాపాల కోసమంటూ అద్దెకు తీసుకుని అందులో పేకాడుతున్నారు. మరికొందరు ఫామ్ హౌజ్‌లను పేకాటకు వాడుకుంటున్నారు. పట్టణ శివార్లలో నిర్మాణాలు మద్యలో నిలిచిపోయిన ఇళ్లలో కొందరు పేకాట ఆడుతున్నారు. అలాగే పట్టణానికి చుట్టుపక్కల చెట్లల్లోకి వెళ్లి ఆడేవారున్నారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పొలాల వద్ద పేకాడుతున్నారు. సహజంగా అడవుల్లోకి ఎవరూ వెళ్లరు. దీంతో తమను పట్టుకునేవారు ఉండరనే ఉద్దేశంతో చాలా మంది పేకాడేవారు అడవిబాట పడుతున్నారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి పేకాటను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
రూ. లక్షల్లో నష్టపోతున్నా..
పేకాటకు అలవాటు పడిన వారిలో చాలా మంది రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ టలో నష్టపోయిన సొమ్మును తిరిగి ఆటలోనే సంపాదించాలన్న పట్టుదలతో కొందరు మరి న్ని అప్పులు చేసి ఆడుతున్నారు. రోజుల తరబడి అప్పులు చేసి ఆటలో నష్టపోయి మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అప్పులపాలై ఇంటిని అమ్ముకున్నాడు. మరో వ్యక్తి సొంతూరులో ఉన్న వ్యవసాయ భూమిని అ మ్మేశాడు. ఇలా ఎంతో మంది ఆటలో నష్టపోయి కుటుంబాలను రోడ్డున పడేశారు. పే కాటలో నష్టపోయి ఆస్తులు కరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారూ ఉన్నారు.
దాడులకు వెరవని పేకాటరాయుళ్లు
అడ్డాలు మార్చి ఆడుతున్న వైనం
ఏడు నెలల్లో 103 కేసులు నమోదు