
గ్రామానికి చెందిన భూమి మాకే చెందాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామ శివారులో గల ఇనాం భూమిని అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదని ఈభూమి గ్రామానికే చెందాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి సేవ చేస్తున్న గైని కులస్తులకు గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి పెద్ద మనుషులు 3 ఎకరాల 15 గుంటల భూమిని ఇచ్చారు. ఈభూమిని గ్రామస్తులకు తెలియకుండా మర్కల్‌కు చెందిన మర్కంటి బుచ్చన్నకు సేల్‌డీడ్ చేయించిన విషయం గ్రామస్తులకు తెలియడంతో మంగళవారం బుచ్చన్నను గ్రామానికి పిలిపించి ఇనాం భూమిని ఎలా కొన్నావని ప్రశ్నించారు. గైని వారికి కొన్ని డబ్బులు ఇచ్చానని నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే ఈభూమిని వారికే ఇస్తానని సమాధానం చెప్పారు. దీనికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. తమ గ్రామానికి చెందిన భూమి తమకే చెందే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి గ్రామానికి చెందని యెడల టిప్పర్లతో మొరం నింపి భూమిని చదును చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు భూమిలో ఎలాంటి పంట పెట్టవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, మాజీ సర్పంచ్ బాల్‌రెడ్డి, విండో డైరెక్టర్‌లు మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.