
మహిళను కాపాడిన పోలీసులకు అభినందన
కామారెడ్డి క్రైం: ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన మహిళను కాపాడిన ఇద్దరు పోలీసులను పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని ఓ కుంటలో సోమవారం దూకేసింది. స్థానికుల సమాచారం మేరకు దేవునిపల్లి 2 వ ఎస్సై భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణలు హుటాహుటినా అక్కడకు చేరుకుని మహిళను చెరువులో నుంచి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న తరువాత మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్సై, కానిస్టేబుల్‌లకు నగదు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ రామన్ తదితరులు పాల్గొన్నారు.