
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్‌కు ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు విన్నవించారు. మంగళవారం ఆయనను హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. పలు డిమాండ్లను, సూచనలను అందజేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఫోటోలు అప్‌లోడ్ చేసి నెల రోజులు కావస్తున్నా కొందరు లబ్ధిదారులకు డబ్బులు జమ కావడం లేదని ఎమ్మెల్యే ఎండీకి వివరించారు. అలాగే పథకం ప్రారంభానికి ముందు నిర్మించిన బేస్‌మెంట్లకు ఆమోదం ఇచ్చినా చెల్లింపులు జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే చిన్న ప్లాట్లలో కూడా జీ ప్లస్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. 400–600 చదరపు అడుగుల పరిమితిలో 20 చదరపు అడుగులు వరకు భిన్నంగా ఉన్నా అనుమతించాలని కోరారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడానికి ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్‌ను నియమించి పర్యవేక్షణ బలోపేతం చేయాలని కోరారు. అర్హులైన ఇతర కుటుంబాలకు కూడా అదనపు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఏవైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతూ బిల్లులు చెల్లింపులు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల చెల్లింపులు ఆలస్యం అవుతున్న కారణంగా వారికి త్వరగా బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు.
హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి
ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు విన్నపం