
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
మువ్వన్నెల కాంతుల్లో కలెక్టరేట్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో అధికారులు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల ప్రదానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. 9.40 గంటలకు జిల్లా పురోగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, 10.10 గంటలకు అతిథులు, అధికారుల పరిచయం, 10.20 గంటలకు శకటాల ప్రదర్శన, 10.40 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.10 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 12 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు