
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి క్రైం: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్‌లు, అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలని సూచించారు.
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంత్రితో పేర్కొన్నారు. జిల్లాలో 43 లోలెవెల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలు ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, గ్రామపంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. అవసరం ఉన్నచోట్ల బాధితులకు వసతి కల్పించడం కోసం పాఠశాలలు, గ్రామపంచాయతీ భవనాలు, ఫంక్షన్ హాళ్లలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశామని వివరించారు. వీసీలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ పాల్గొన్నారు.