
మారాల్సిందెంతో!?
చిన్న ఆలోచనల్లోంచే పెద్ద ఆవిష్కరణలు
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు
కామారెడ్డి క్రైం/కామారెడ్డి అర్బన్: వందేళ్ల భారతావనిని ప్రపంచంలో అగ్రగామిగా చూడాలంటే రానున్న రోజుల్లో వ్యవస్థాపరంగా, సామాజికంగా ఇంకా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందని యువత పేర్కొంది. దేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలకు సమీపిస్తున్న నేపథ్యంలో ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గురువా రం టాక్ షో నిర్వహించింది. ఇందులో యువత పాల్గొని తమ మనోగతాన్ని సాక్షితో పంచుకుంది. కొంతకాలంగా పలు రంగాల్లో అభివృద్ధి, మార్పు కనిపిస్తున్నప్పటికీ పాలనా వ్యవస్థల్లో అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పటికీ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. సాంకేతికతలో దేశం ముందంజలో ఉన్నా విద్య, వైద్యం, మౌలిక వసతులు, వ్యవసాయం, దేశ రక్షణ తదితర ముఖ్యమైన రంగాలకు మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మహిళల వ్యక్తిగత, సామాజిక భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రతి పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. అలా లేకపోవడం వల్లే చాలా సందర్భాల్లో వనరుల దుర్వినియోగం జరిగి దేశ ప్రగతి వెనక్కి నెట్టబడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినీతిని అంతం చేసి ప్రతిభకు పట్టం కట్టాలని, అన్ని రంగాల్లో మార్పు కోసం ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. తద్వారా సామాజిక న్యాయం జరిగి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రతినిధులు సత్యనారాయణ, సురేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యువత చేసే చిన్న ఆలోచన దేశాభివృద్ధిలో పెద్ద ఆవిష్కరణ అవుతుందని సాందీపని కళాశాలల డైరెక్టర్ బాలాజీరావు పేర్కొన్నారు. సాధారణ డిగ్రీ చదివి ఐఏఎస్‌లు అయిన వారెందెరో ఉన్నారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక దేశాభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఓటమి అంటే ప్రయత్నం చేయకపోవడమనే విషయాన్ని యువత గుర్తించాలని సూచించారు. విచ్చలవిడితనం, ఊహలనుంచి సహజమైన జీవితానికి అలవాటుపడాలన్నారు. సామాజిక మాధ్యమాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.
పాలన వ్యవస్థలు
అవినీతిరహితం కావాలి
విద్య, వైద్యం, మహిళల భద్రత
మెరుగుపడాలి
వ్యవసాయం, రక్షణ రంగాలు
మరింత బలపడాలి
ప్రతి ఒక్కరికి సామాజిక
న్యాయం దక్కాలి
అప్పుడే దేశం అన్ని రంగాల్లో
ముందుంటుంది
‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’
‘సాక్షి’ టాక్ షోలో యువత మనోగతం

మారాల్సిందెంతో!?