కామారెడ్డిలో ‘బిగ్‌’ ఫైట్‌.. బరిలో 39 మంది అభ్యర్థులు! | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో ‘బిగ్‌’ ఫైట్‌.. బరిలో 39 మంది అభ్యర్థులు!

Published Fri, Nov 17 2023 1:22 AM

- - Sakshi

సాక్షి, కామారెడ్డి: 'వీఐపీ అభ్యర్థులు బరిలో ఉన్న కామారెడ్డి నియోజకవర్గంలో ‘బిగ్‌’ ఫైట్‌ నడుస్తోంది. ఇక్కడ 39 మంది పోటీలో ఉండడంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.'

నియోజకవర్గంలో 266 పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. బ్యాలెట్‌ యూనిట్‌కు, కంట్రోల్‌ యూనిట్‌ జతగా ఉంటుంది. ఒక పోలింగ్‌ కేంద్రానికి ఒక కంట్రోల్‌ యూనిట్‌ సరిపోతుంది. బ్యాలెట్‌ యూనిట్లను మాత్రం అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. 15 మందిలోపు అభ్యర్థులుంటే ఒక బ్యాలెట్‌ యూనిట్‌ సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ మంది బరిలో ఉంటే మరిన్ని బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతాయి. కామారెడ్డిలో 39 మంది పోటీ చేస్తుండడంతో మూడు బ్యాలెట్‌ యూనిట్లు అవసరం అవుతాయని అధికారులు తెలిపారు. ఈ లెక్కన 266 పోలింగ్‌ బూత్‌లకు మూడు బ్యాలెట్‌ యూనిట్ల చొప్పున 798 యూనిట్లు అవసరం.

ఇదే మొదటిసారి..
కామారెడ్డి నియోజకవర్గంలో ఇంత మంది అభ్యర్థులు పోటీ పడడం ఇదే మొదటిసారి. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండడంతో కామారెడ్డి నియోజకవర్గంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఇదే సమయంలో పోటీలో 39 మంది నిలవడం కూడా సంచలనంగా మారింది.

అభ్యర్థులు వీరే..!
బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌, కాంగ్రెస్‌ రేవంత్‌రెడ్డి, బీజేపీ వెంకటరమణారెడ్డి, బీఎస్పీ సురేశ్‌గౌడ్‌, ప్రజాసేవ పార్టీ ఆకుల హన్మాండ్లు, ధర్మసమాజ్‌ పార్టీ ఉగ్రవాయి బోలేశ్వర్‌, బహుజన్‌ముక్తి పార్టీ కన్యక ప్రసన్న, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్‌ కానుగంటి రాజు, యుగ తులసి పార్టీ కోటగిరి శ్రీనివాస్‌, ఉత్తర రాష్ట్ర తెలంగాణ దండు ధనుంజయ్‌, రాజ్యాధికార పార్టీ నర్సింహనరేందర్‌, బహుజన భారత్‌ పార్టీ బాబు, ఆర్‌పీఐ మహ్మద్‌ ఆరిఫ్‌, బహుజన లెఫ్ట్‌ పార్టీ సిద్దరాములు.

స్వతంత్య్ర అభ్యర్థులు: ఎర్రోల్ల నరేశ్‌, ఆకుల హరీశ్‌, కటికం సంగారెడ్డి, కంతె సాయన్న, కుంట రవి, గబ్బుల నాగేందర్‌, చంద్రశేఖర్‌, చెవుల పర్శరాములు, జూకంటి అంజల్‌రెడ్డి, దొడ్లె రాజేందర్‌, బీబీ నాయక్‌, నీల నాగరాజు, బందిలాల్‌ మాంజా, బరిగెల శివ, బోదాసు నర్సింలు, మంగిలిపల్లి భార్గవి, మహ్మద్‌ ఖలీలుల్లా, మహ్మద్‌ తాహెర్‌ బిన్‌ అహ్మద్‌, మాడిశెట్టి తిరుపతి, బూక్య రవినాయక్‌, రాజగిరి సంతోష్‌రెడ్డి, రుపావత్‌ కొండయ్య, గుగులోత్‌ వెంకన్న, షేక్‌ అబ్దుల్‌ వాహెద్‌, హుస్సేన్‌ షేక్‌.

Advertisement
Advertisement