కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు కామారెడ్డి జిల్లా కేంద్రం వేదికవుతోంది. ఈనెల 7, 8, 9 తేదీలలో పట్టణానికి సమీపంలోని విద్యానికేతన్ హైస్కూల్‌లో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లాలో తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయడానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో 33 కమిటీలను ఏర్పాటు చేశారు.
33 జిల్లాలనుంచి..
రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొననున్నారు. ఇందులో 880 ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ప్రాజెక్టుకు ఒక విద్యార్థితో పాటు ఒక గైడ్ టీచర్ చొప్పున 1,654 మంది హాజరవుతారు. ఎన్‌సీఈఆర్‌టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శని (ఎస్‌ఎల్‌బీవీపీ), ఇన్‌స్పైర్‌కు సంబంధించి రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ అండ్ ప్రాజెక్ట్ కాంపిటీషన్ (ఎస్‌ఎల్‌ఈపీసీ)లను సంయుక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సైన్స్ ఫెయిర్ ఈనెల 7న ప్రారంభం కానుండగా.. ఒక రోజు ముందుగానే వివరాలు నమోదు చేసుకోనున్నారు. దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆరో తేదీనే చేరుకుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవసరమైన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సైన్స్ ఫెయిర్ ప్రారంభ కార్యక్రమానికి విద్యాశాఖ ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవనున్నారు. 9న మధ్యాహ్నం జరిగే ముగింపు కార్యక్రమంలోనూ ప్రముఖులు పాల్గొంటారని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఈనెల 7, 8, 9 తేదీలలో
నిర్వహించనున్న విద్యాశాఖ
రాష్ట్రం నలుమూలల నుంచి
880 ప్రదర్శనలకు అవకాశం
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం


