నాట్లలోనూ ముందంజ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ధాన్యం సేకరణలో గత రెండు సీజన్‌లలో వరుసగా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా వరి నాట్లు వేయడంలోనూ ముందంజలో నిలుస్తోంది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి వరి నాట్లు వేయడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 7 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయగా, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 2,01,798 ఎకరాల్లో రైతులు నాట్లు వేశారు. ఈ సీజన్‌లో 4,31,042 ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 55 శాతం విస్తీర్ణంలో నాట్లు పూర్తయ్యాయి.
జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్థానిక కూలీలే కాకుండా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వరంగల్‌కు చెందిన వలస కూలీలు సైతం వరి నాట్లు వేస్తున్నారు. వరినాట్లు వేయడంలో వీరికి పెట్టింది పేరు. గంట వ్యవధిలోనే ఒక ఎకరంలో నాట్లు వేేస్తున్నారు. 8 నుంచి 10 మంది కూలీలు ఎకరానికి రూ.4,500 నుంచి రూ.5,200 వరకు రైతుల నుంచి తీసుకుంటున్నారు. వరి నాట్లు వేగంగా అవుతుండడంతో యూరియా కొనుగోళ్లు పెరిగాయి. జిల్లాకు 53,393 మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. ఇప్పటి వరకు 43,308 మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో యాసంగి సీజన్‌కు గాను మొత్తం 5,22,730 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా జిల్లాలో ఇప్పటివరకు 2,63,126 ఎకరాల్లో (54శాతం) వివిధ పంటలను రైతులు సాగు చేశారు.మొక్కజొన్న పంట 25,202 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, ఈ అంచనాలను మించి రైతులు భారీగా 31,880 ఎకరాల్లో (165 శాతం) సాగు చేయడం విశేషం. శనగ పంట 14,366 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. కందులు 48 ఎకరాల్లో, మినుములు 171, పొద్దు తిరుగుడు 181, పొగాకు 2,548 ఎకరాల్లో రైతులు వేశారు.
జిల్లాలో జోరుగా యాసంగి సాగు పనులు
ఇప్పటికే 55 శాతం వరినాట్లు పూర్తి
అన్ని పంటలూ కలిపి 54 శాతం
ఇప్పటికే వేసిన అన్నదాతలు
రికార్డు స్థాయిలో 165 శాతం
మొక్కజొన్న సాగు


