పొగమంచు మిగిల్చిన విషాదం
● దారి కనిపించక అదుపుతప్పిన కారు
● బండరాయిని ఢీకొని
బోల్తాపడిన వాహనం
● ఒకరి మృత్యువాత
కామారెడ్డి క్రైం: బంధువులు, స్నేహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్న ఆ యువకుడు.. అంతలోనే విగత జీవిగా మారాడు. దట్టంగా కమ్ముకున్న పొగమంచుతో దారి కనిపించక వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో గాయాలపాలై మరణించాడు. జిల్లా కేంద్రంలో గురువారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి.
రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన గోపు నర్సింలు కుటుంబం చాలా ఏళ్ల క్రితమే జిల్లాకేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో స్థిరపడింది. అతడి కుమారుడైన గోపు నరేశ్ (30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నరేశ్‌కు ఏడాది క్రితమే భిక్కనూరు మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూతురుతో వివాహమైంది. అతడు స్నేహితులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడం కోసం బుధవారం కామారెడ్డికి వచ్చాడు. సంబురాలను ముగించుకుని కారులో ఇంటికి తిరిగి వస్తుండగా.. కలెక్టరేట్ సమీపంలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా దారి కనిపించక వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెనుక మరో కారులో వస్తున్న అతడి బావమరిది దీనిని గమనించి తీవ్ర గాయాలపాలైన నరేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే నరేశ్ మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. స్టీరింగ్ సక్రమంగా పనిచేయకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని ముందుగా భావించారు. అయితే పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు.
పొగమంచు మిగిల్చిన విషాదం


