తుని: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, సోషల్ మీడియా అక్కౌంట్‌లను మిటా సంస్థకు ఫిర్యాదు చేసి బ్లాక్ చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు. శుక్రవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంప్ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఉందన్నారు. తమ అభిప్రాయాలను యాప్ ద్వారా ప్రజలకు చేరువ చేయవచ్చన్నారు. రాష్ట్రంలో 80 శాతం సామాజిక మాధ్యమాలు ఓ పార్టీ చేతుల్లో ఉన్నాయని, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కి అకౌంట్లు బ్లాక్ చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. అమరావతిలో రూ.10 వేల కోట్ల పనులకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇదేంటని ప్రశ్నించిన వ్యక్తులపై కేసులు పెడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో విశాఖపట్నం రుషికొండలో హరిత రిసార్ట్స్ తొలగించి భవనాలు నిర్మిస్తే పచ్చ మీడియా, టీడీపీ నాయకులు నానాయాగి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో కొండలకు గుండుకొట్టిందని విమర్శించారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి మళ్లీ వచ్చిందని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ముద్రగడ మృతిని రాజకీయం చేయవద్దు
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతిని రాజకీయం చేయవద్దని దాడిశెట్టి రాజా హితవుపలికారు. ముద్రగడ అంత్యక్రియలు ఆయన ఇష్టం మేరకు నిర్వహించామని ముద్రగడ కుమారులు లేఖ రాశారని, ప్రభుత్వ లాంఛనాలు వద్దని పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేసినా బురద చల్లడం మానుకోలేదన్నారు. కులం కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అని, అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోయినా ఓ వర్గం మీడియా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేసిన వంగవీటి మోహనరంగాను హత్య చేశారని, ఈ సంఘటనలో తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన 100 మంది కాపులు కోర్టుల చుట్టూ తిరిగారన్నారు. ఈ విషయాలను యువత తెలుసుకోవాలని సూచించారు. జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత, పెరికి కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవానీ, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, అనుబంధ విభాగాల నాయకులు రేలంగి రమణాగౌడ్, బోడపాటి సతీష్, రాయిమేరీ అవినాష్, తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, తుని పట్టణ పార్టీ కన్వీనర్లు దుంగల నాగేశ్వరరావు, చొక్కా హరిబాబు, చింతకాయల చినబాబు, అన్నవరం శ్రీను, తుని నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంగుళూరి సుశీల, పట్టణ అధ్యక్షురాలు చింతల సునీత తదితరులు పాల్గొన్నారు.
ఫ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా!
ఫ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
ఫ జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరణ


