వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన
అన్నవరం: స్థానిక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా తమ మూడు నెలల పసికందు మృతి చెందాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, గ్రామస్తులు శుక్రవారం రాత్రి ఆందోళన చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన సతీష్, వీరదుర్గ దంపతుల మూడు నెలల కుమారుడికి రొంప, జ్వరం రావడంతో గురువారం స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నయమైందని చెప్పడంతో ఇంటికి తీసుకు వెళ్లిపోయారు. తిరిగి శుక్రవారం జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ఇక్కడ వైద్య సిబ్బంది ఆ బాలుడికి అంతా నయమవుతుందని చెప్పి, వైద్యం చేస్తున్నట్టు నటించారని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. ఆక్సిజన్ స్థాయి పడిపోతుందని ఒకసారి, ఇప్పుడు బాగుందని ఇంకోసారి చెబుతూ వచ్చీ రాని వైద్యం చేశారని అన్నారు. ముందే తమ కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబితే, వేరే ఆసుపత్రికి తీసుకు వెళ్లేవారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నేపథ్యంలో అన్నవరం పోలీసులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
పారదర్శకత తప్పనిసరి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తప్పనిసరిగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పౌరసరఫరాల శాఖ పనితీరు, నిత్యావసరాల పంపిణీ వ్యవస్థపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. మండల స్థాయి నిత్యావసర సరకుల నిల్వ కేంద్రాల వద్ద సరకుల భద్రత, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ పక్కాగా ఉండాలని అన్నారు. పౌర సరఫరాల వ్యవస్థలో ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తేలితే సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు.
సమస్యలు పరిష్కరించండి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): న్యాయవాదుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్‌ఏ) జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఐఎల్‌ఏ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో టి.తిప్పే నాయక్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం చేసి అమలు చేయాలని, అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్‌ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్ల పాటు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. తొలుత న్యాయవాదులు స్థానిక కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ర్యాలీగా బయలు దేరి కలెక్టరేట్‌కు చేరుకుని నినదించారు. ఐఎల్‌ఏ జిల్లా ఉపాధ్యక్షుడు కోలా శ్రీహరిరావు, మహిళా కన్వీనర్ డాక్టర్ వసంత, ఐఎల్‌ఏ జిల్లా నాయకులు జేబీ రమణ, మంగా వెంకటశివరామకృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎం.సరోజినీ, కోశాధికారి పితాని శ్రీదేవి పాల్గొన్నారు.
నేడు విభిన్న ప్రతిభావంతులకు
ప్రత్యేక గ్రీవెన్స్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి నెలా 3వ శనివారం దివ్యాంగుల సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ ప్రజావాణి హాలులో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ గ్రీవెన్స్ జరుగుతుందన్నారు. పింఛన్లు, సహాయ పరికరాల మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు ఇతర శాఖాపరమైన విషయాలకు సంబంధించి అర్జీలను నేరుగా సమర్పించవచ్చని తెలిపారు.


