జిల్లాలో 80వేల మంది మహిళలకు చీరలు పంపిణీ
గద్వాల: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో 80వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. 80వేల మంది మహిళలు ఉండగా, 86 వేల చీరలు వచ్చినట్లు తెలిపారు. చీరలను గ్రామీణ, పట్టణప్రాంతాల్లో నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గద్వాల, అలంపూరు రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఏపీఎం, గ్రామకార్యదర్శులు, మహిళ సంఘాల సభ్యుల పరస్పర సహకారంతో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. పంపిణీ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రతి లబ్ధిదారు ఫొటోతో పాటు ఆధార్‌కార్డు నంబర్ సేకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులను కోటిశ్వరులు చేయాలనే లక్ష్యంతో విరివిగా వడ్డీలేని బ్యాంకురుణాలను అందించడం జరుగుతుందన్నారు. వారి ఆర్థిక అభివృద్ధి కోసం బస్సులు పెట్రోల్‌బంకులు, సోలార్‌ప్లాంట్లు కూడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, డీపీవో నాగేంద్రం, ఏడీఆర్‌డీవో శ్రీనివాస్, మహిళసంఘం సభ్యులు పాల్గొన్నారు.


