దోమల విజృంభణ
● వర్షాకాలం ముగిసినా తగ్గని దోమకాటు
● మున్సిపాలిటీల్లో నివారణ చర్యలు అంతంతే
● ఆందోళనలో ప్రజలు
గద్వాలటౌన్: వర్షాకాలం ముగిసినప్పటికీ దోమల బెడద మాత్రం తప్పడం లేదు. పల్లె, పట్టణం తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దోమల సైర్వవిహారం ఎక్కువగా ఉండటం ఆందోళనకు గురిచేస్తోంది. దోమల నివారణ చర్యలకు మున్సిపాలిటీ పరంగా ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా.. ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటోంది. అయితే ఫాగింగ్, కాల్వల్లో దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నట్టు అప్పుడప్పుడు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో కిందిస్థాయి సిబ్బంది పనితీరును పర్యవేక్షించక పోవడంతో పట్టణాల్లోని కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఏ మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలు ప్రజానీకాన్ని వెంటాడుతున్నాయి.
పారిశుద్ధ్య లోపంతో..
జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో డ్రెయినేజీలతో పాటు కందకాల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లా కేంద్రంలో సగభాగం కందకాలు విస్తరించి ఉన్నాయి. ఎగువ నుంచి, అంతర్గత డ్రెయినేజీల నుంచి వచ్చే మురుగునీరంతా కందకంలో కలుస్తున్నాయి. వాటిలో సక్రమంగా పూడిక తీయకపోవడంతో చెత్తా చెదారాలతో నిండిపోయాయి. మరోవైపు స్థానిక సుంకులమ్మ మెట్టు వెనక భాగాన ఉన్న అవుట్‌లేట్ వద్ద అనువైన డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఇటీవల ప్రధాన డ్రెయినేజీల్లో చేపట్టిన పూడికతీత పనులు నామమాత్రంగానే సాగాయి. అయిజ, శాంతినగర్ వంటి పట్టణాల్లోనూ మురుగు కాల్వల్లో ప్లాస్టిక్ కవర్లు పేరుకుపోయాయి. దీంతో మురుగు ముందుకు పారడం లేదు. చాలా వరకు డ్రెయినేజీలు పూడికతో నిండి మురుగు పారుదలకు ఇబ్బందిగా ఏర్పడింది. ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోవడంతో దోమల ఉధృతి పెరిగిపోతోంది. దోమల నివారణ చర్యలు గద్వాలలో ఓ మోస్తరుగా ఉండగా.. మిగిలిన అయిజ, అలంపూర్, వడ్డేపల్లి పట్టణాల్లో మచ్చుకై నా కనిపించవు.
ఏడాదికి రూ.4 కోట్లపైనే..
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 30వేల కుటుంబాలు నివసిస్తుండగా.. దోమల నివారణ మందుల వ్యాపారం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రతి కుటుంబంలో ఎవరి స్థాయి మేరకు వారు రోజుకు రూ.2 నుంచి రూ.5 వరకు దోమల నివారణ కోసం ఖర్చు చేస్తున్నారు. సగటున నెలకు ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేస్తోంది. ఇలా పట్టణాల్లో దోమల మందుల వినియోగ వ్యయం ఏడాదికి రూ.4 కోట్లపైనే దాటుతోంది. ఇది కేవలం ఆయా కుటుంబాలు వ్యక్తిగతంగా ఏడాదికి చేస్తున్న ఖర్చు. వీటితో పాటు మున్సిపాలిటీ దోమల సంహరణ కోసం రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే.
దోమల విజృంభణ
దోమల విజృంభణ


