పల్లెపోరుకు సై..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్/గద్వాల టౌన్: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం సందడిగా మారింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. తొలి విడత ఎన్నికలకు ఈ నెల 27 (గురువారం) నుంచే నామినేషన్లను స్వీకరించనుండగా.. డిసెంబర్ 11న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు, మూడో దశ పంచాయతీ ఎన్నికలను చేపట్టనున్నారు. ఈ నెల 30 నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరించనుండగా.. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించి.. 17న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటనతో గ్రామాల్లో రాజకీయ సందడి జోరందుకుంది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా అని వేచిచూస్తున్న ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు గెలుపే లక్ష్యంగా గ్రామాల్లో తమ వ్యూహాలను అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
1,678 గ్రామాలు..
15,077 వార్డులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,678 గ్రామాలు, 15,077 వార్డులు ఉన్నాయి. అయితే మొదటి విడతలో 550 గ్రామాలు, 4,840 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో 565 గ్రామాలు, 5,221 వార్డులకు, మూడో విడతలో 563 గ్రామాలు, 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు ఉండనున్నాయి. డిసెంబర్ 11న తొలి విడత, 14న రెండో విడత, 17న మూడో విడత ఎన్నికలు నిర్వహించనుండగా, పోలింగ్ రోజునే కౌంటింగ్ చేపట్టి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
గ్రామాల్లో రాజకీయ సందడి..
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ సందడి మొదలైంది. ఆయా గ్రామాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన ఆశావాహులు ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కో గ్రామంలో కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పోటీపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే క్రమంలో రిజర్వేషన్లు తమకు వస్తాయని ఆశించి భంగపడిన వారిలో నిరాశ నెలకొంది. ఇప్పటికే పార్టీల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతోపాటు గెలుపు గుర్రాలు ఎవరన్న దానిపై ఎవరికి వారు కసరత్తు చేస్తున్నారు. దీనికితోడు ఈసారి ఇద్దరు పిల్లల నిబంధనను ప్రభుత్వం సడలించడంతో చాలామందికి అవకాశం దక్కుతోంది. దీంతో గ్రామాల్లో పోటీచేస్తున్న ఆశావహుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
అమలులోకి కోడ్..
పంచాయతీ ఎన్నికల పాలకవర్గం గడువు ముగిసి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయ్యింది. నెలల తరబడి ఎన్నికల నిర్వహణ కోసం ఎదురుచూస్తుండటం, ఇప్పటికే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, వాయిదా పడిన క్రమంలో ఈసారి ఎన్నికల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, ఎన్నికల సిబ్బందికి శిక్షణతోపాటు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేశారు. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా అధికార యంత్రాంగం పూర్తిస్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది.
మూడు విడతల్లోపంచాయతీఎన్నికల నిర్వహణ
షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
రేపటి నుంచే తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
డిసెంబర్ 11న తొలి దశ పోలింగ్, ఫలితాలు వెల్లడి
ఉమ్మడి జిల్లాలో 1,678 గ్రామాలు.. 15,077 వార్డులు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇలా..
జోగుళాంబ గద్వాల జిల్లాలోని 13 మండలాల్లో 255 గ్రామపంచాయతీలు ఉండగా.. 2,390 వార్డులు ఉన్నాయి. మొదటి విడతలో 106, రెండో విడతలో 74, మూడో విడతలో 75 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
పల్లెపోరుకు సై..


