వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహించొద్దు
ఇటిక్యాల: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించొద్దని డీఎంహెచ్‌ఓ డా.సంధ్యా కిరణ్మయి అన్నారు. మంగళవారం ఇటిక్యాల పీహెచ్‌సీలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బందితో సమావేశమై మాట్లాడారు. మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై అశ్రద్ధ చేయొద్దన్నారు. గర్భిణులు ప్రసవ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించడంతో పాటు పీహెచ్‌సీలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. కాలనుగుణంగా వస్తున్న సీజనల్ వ్యాధుల నివారణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని.. పీహెచ్‌సీలో ఉచితంగా నిర్వహించే షుగర్, బీపీ, క్యాన్సర్ స్క్రీనింగ్, స్కానింగ్, ఎల్‌ఎఫ్‌టీ, ఆర్‌ఎఫ్‌టీ వంటి పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఎంసీడీ కోఅర్డినేటర్ శ్యాంసుందర్, ఎన్‌సీడీ రమేశ్, మండల వైద్యాధికారిణి రాధిక ఉన్నారు.


