క్షయ నిర్మూలనే లక్ష్యం
● హ్యాండ్ ఎక్స్‌రే యంత్రాలతోవైద్య పరీక్షలు
● అనుమానిత వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు ఆశా వర్కర్ల ఇంటింటి సర్వే
● న్యూట్రీషన్ కిట్ల అందజేత
గద్వాల క్రైం: క్షయ నివారణకు ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ఈ మహమ్మారి వ్యాధి బారిన పడిన వారి నుంచి మరొకరికి సోకకుండా అనుమానితులను గుర్తించేందుకు ఆశావర్కర్ల ద్వారా ఇంటింటి సర్వేను ఇటీవల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో ప్రారంభించింది. 2025 చివరి నాటికి దేశంలో వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కసరత్తు చేపట్టింది. క్షయ.. అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి మరొకరికి సోకకుండా కట్టడి చేసేలా వైద్యాధికారులు ప్రత్యేక చొరువ తీసుకున్నారు. గడచిన మూడు సంవత్సరాలలో వ్యాధి గ్రస్తులను గుర్తించారు. వారికి అవసరమైయ్యే మందులను ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో టీబీ ముక్త్ గ్రామ పంచాయతీలు ఖమ్మంపాడు, చమన్‌కాన్‌దొడ్డి, పల్లెపాడు, ఇటిక్యాలపాడు, కొదండాపురంలో పరీక్షలు చేయగా ఎలాంటి క్షయ వ్యాధిగ్రస్తులు లేరు. హ్యాండ్ ఎక్స్‌రే, అత్యధునిక సీబీన్యాట్ మిషన్ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. రెండు గంటల్లో రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వ్యాధి బయట పడుతుంది.
క్షయ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆరోగ్యశాఖ అనుమానిత వ్యక్తులను గుర్తించి వారికి పరీక్షలు చేసేందుకు అడుగులు వేసినా.. వైద్య పరీక్షలు చేసుకునేందుకు చాలామంది ముందుకు రావడంలేదు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులు, వారితో సఖ్యతగా ఉన్నవారికి వ్యాధి సంక్రమిస్తుంది. మరో వైపు వ్యాధిని మొదటి దశలో గుర్తిస్తే నివారించేందుకు ఎంతో దోహదం పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మృతి చెందే అవకాశం లేకపోలేదు. సంవత్సరంలో ఈ వ్యాధి బారిన పడి 36 మందికిపైగా మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ గుర్తించింది. మొదటి దశలో వ్యాధి గుర్తించి మందులు సకాలంలో వాడితే ఆరు నెలల్లోనే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. వ్యాధి రెండు రకాల వ్యాధిగా ఉండగా.. ఊపిరితిత్తులకు వచ్చిన వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. శరీర భాగాలకు వచ్చిన క్షయ వ్యాధి వ్యాప్తి చెందదు. వెంట్రుకలు, గోళ్లు మినహా అన్ని భాగాలకు క్షయ వ్యాధి వ్యాపిస్తోంది.
నిక్షయ్ మిత్ర ద్వారా తోడ్పాటు
క్షయ వ్యాధి గ్రస్తులకు నిక్షయ్ మిత్ర ద్వారా వారికి ప్రతి నెల నూట్రీషన్ కిట్లు అందజేస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి చేయూత కల్పిస్తున్నారు. వారి కోసం ప్రజాప్రతినిధుల నుంచి ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది నుంచే ఇప్పటి వరకు 200 మందికి న్యూట్రీషన్ కిట్లను అందజేశారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మందుల కొనుగోలు తదితర ఖర్చుల నిమిత్తం రూ.1,000 అందజేస్తుంది. గతేడాది నుంచి నిధులు లేమి కారణంతో రూ.1,000 చెల్లించడం లేదు. దీంతో వ్యాధిగ్రస్తులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటింటి సర్వే చేస్తున్న
ఆశా వర్కర్లు,
వైద్య సిబ్బంది
(ఫైల్)
చైతన్యం తీసుకువస్తున్నాం..
క్షయ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే ఆశా వర్కర్ల ద్వారా చేపట్టాం. క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమాల ద్వారా చైతన్యం తీసుకువస్తున్నాం. వ్యాధి వ్యాప్తి చెందకుండా, మరణాల రేటు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం. హైరిస్క్ ఉన్న వారందరికీ పరీక్షలు చేయిస్తున్నాం. రోగులకు ఉచితంగా మందులు, రూ. 1,000 నగదు అందిస్తున్నాం. క్షయ.. అంటువ్యాధి కావడంతో కుటుంబ సభ్యులు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి.
– కిరణ్‌మయి, జిల్లా ఇంచార్జ్ వైద్యాధికారి
ఇంటింటి సర్వే
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు ప్రభుత్వం ఆశా వర్కర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టింది. అన్ని ప్రాథమిక ఆరోగ్య, బస్తీ దవాఖాన, జిల్లా ఆసుపత్రి, సబ్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి ప్రాంతాల్లో ఆశా వర్కర్లు హైరిస్కు వ్యాధి గ్రస్తులైన 60 ఏళ్లు పైబడిన వారికి, డయాబెటిస్, హెచ్‌ఐవీ, పోషణకాహార లోపం, గతంలో క్షయ వ్యాధి వచ్చిన వారికి, క్షయ వ్యాధి గ్రస్తుడి కుటుంబ సభ్యులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. దగ్గు, జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చాతినొప్పి, రక్తం పడటం, ఎడతెరిపి లేకుండా దగ్గు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించడం, వారికి ఆరోగ్య అంశాలపై వివరిస్తున్నారు.
నివారణ దిశగా..
క్షయ నిర్మూలనే లక్ష్యం


