తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి
గద్వాలన్యూటౌన్: ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను గౌరవిస్తూ, మంచిగా చూసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి సునంద అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మహిళా శిశు సంక్షేమ, విద్యాంగుల వయోవృద్దుల శాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. వారి సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులను వదిలివేసి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారని, అలా కాకుండా వారిని తమ దగ్గరే ఉంచుకొని మంచిగా చూసుకోవాలన్నారు. వయోవృద్దులు ఏమైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నం. 14567ను సంప్రదించాలని సూచించారు. డీసీపీఓ నరసింహ, కమ్యూనీటీ ఎడ్యుకేటర్ కృష్ణయ్య, అధ్యాపకుడు నాగభూషణ్, విద్యార్థులు పాల్గొన్నారు.


