చీరల పంపిణీ లేనట్టేనా? | - | Sakshi
Sakshi News home page

చీరల పంపిణీ లేనట్టేనా?

Oct 14 2026 3:59 AM | Updated on Oct 14 2026 3:59 AM

జిల్లాకు కావాల్సిన, వచ్చిన చీరల వివరాలు

ఆదేశాలు రాలేదు

రూ.500 విలువైన చీర

జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు, గోదాముల్లో నిల్వ

భూపాలపల్లి: తెలంగాణ ఆడపడుచులు ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగకు ప్రభుత్వం అందించే చీరల పంపిణీపై తీవ్ర ఉత్కంఠ, నిరాశ వ్యక్తమవుతున్నాయి. పూలపండుగ వేళ ప్రభుత్వం ఉచితంగా చీరలను అందిస్తుందని మహిళలు ఆశగా ఎదురుచూసినప్పటికీ, నాలుగు రోజుల్లో పండుగ ఉండగా, పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశాల కోసం క్షేత్రస్థాయి అధికారులు నిరీక్షిస్తుండడంతో, చీరలు గోదాముల్లోనే మూలుగుతున్నాయి.

జిల్లాకు చేరిన చీరలు

జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 9వేల మహిళా సంఘాల్లోని సభ్యులతో పాటు 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు ప్రభుత్వం ఉచితంగా ఒక్కో చీరను పంపిణీ చేయనుంది. ఈ మేరకు జిల్లాకు మొత్తం 1,22,746 చీరలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 82,634 జిల్లాకు రాగా, ఇంకా 40,112 రావాల్సి ఉంది. కాగా 18 ఏళ్లకు పైబడిన వారికి 6.30 మీటర్ల పొడవైన 1,22,111 చీరలు, వయసు పైబడిన వారికి 9 మీటర్ల పొడవైన 635 చీరలను అందించనున్నారు.

ఆదేశాల కోసం ఎదురుచూపులు

సాధారణంగా బతుకమ్మ పండుగ ప్రారంభానికి ముందే మహిళలకు చీరలను అందించడం రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ మేరకు సిరిసిల్ల, ఇతర ప్రాంతాల నేత కార్మికుల ద్వారా నాణ్యమైన చీరలను సిద్ధం చేసి జిల్లాలకు కూడా తరలించారు. అయితే బతుకమ్మ పండుగ సమయానికి పంపిణీ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు పంపిణీని నిలిపేశారు.

ఇందిరాగాంధీ జయంతి రోజేనా?

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా బతుకమ్మ పండుగకు కాకుండా, మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్‌ 19వ తేదీన చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల మహిళలకు, అర్హులైన ఆడపడుచులకు ఈ చీరలను అందజేసేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కావాల్సిన 6.30 మీటర్ల చీరలు: 1,22,111

వచ్చినవి : 82,634

కావాల్సిన 9 మీటర్ల పాలికాట్‌ చీరలు: 635

మొత్తం చీరలు : 1,22,746

ఇంకా రావాల్సినవి: 40,112

జిల్లాకు ఇప్పటికే 70 శాతం చీరలు చేరాయి. వాటిని గోదాముల్లో భద్రంగా నిల్వ చేశాం. అయితే అర్హులైన మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయాలని మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం ఎప్పుడు పంపిణీ చేయాలని చెప్పినా, పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ పీడీ

రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా అందించనున్న ఒక్కో చీర విలువ సుమారు రూ.500 వరకు ఉంటుందని తెలుస్తోంది. సిరిసిల్లలో ఒక చీర తయారీకి రూ. 385 నుంచి రూ. 400 వరకు ఖర్చు అవుతుండగా, షోలాపూర్‌, సూరత్‌, హైదరాబాద్‌లో చేస్తున్న ప్రాసెసింగ్‌ చేయించేసరికి చీర ధర రూ.450 నుంచి రూ. 500 వరకు చేరుకుంటుంది. అయితే ఆడపడుచులు బతుకమ్మ పండుగ పూట కొత్త చీరలు కట్టుకోవాలని ఆశపడినప్పటికీ, మళ్లీ ఇందిరమ్మ జయంతి వరకు ఆగక తప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరో నాలుగు రోజుల్లో సద్దుల బతుకమ్మ

పంపిణీకి సర్కారు నుంచి రాని ఆదేశాలు

ఇందిరాగాంధీ జయంతికి పంపిణీకి సన్నాహాలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement