జిల్లా పెద్దాస్పత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్
● కరోనా సమయంలో
రూ.1.20కోట్లతో ఏర్పాటు
● నిర్వహణ, ఉత్పత్తిని పట్టించుకోని
అధికారులు
● ఆర్థిక భారం పడుతున్నా
కొనుగోలుకే మొగ్గు
భూపాలపల్లి అర్బన్: అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే ఆక్సిజన్ ప్లాంట్ అధికారుల నిర్లక్ష్యంతో మూలనపడింది. కరోనా సమయంలో ఎంతో ఉపయోగపడిన జిల్లా పెద్దాస్పత్రిలోని ప్లాంట్ ప్రస్తుతం నిర్వహణలోపంతో మూతబడింది. దీంతో రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను బయటనుంచి కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక భారం పరగడమే కాకుండా రోగుల ప్రాణాలకు రక్షణ కరువవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నిరుపయోగంగా మారి నానాటికీ పనికి రాకుండా పోతున్నా పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
నెలకు 30నుంచి 40 సిలిండర్లు..
ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువచ్చి వినియోగిస్తున్నారు. ఆస్పత్రి ప్రతీ నెల 30నుంచి 40 సిలిండర్ల వరకు అవసరమవుతున్నాయి. ఒక్కో సిలిండర్‌కు బయట మార్కెట్‌లో రూ.600 నుంచి రూ.700 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ నెల రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి సుమారు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు దుర్వినియోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వ్యాధుల వ్యాప్తి సమయాన వినియోగం మరింత పెరుగుతుంది. ఒకవేళ గాలి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అందుబాటులోకి తీసుకొస్తే వ్యయం సగానికి పైగా తగ్గుతుందని.. సాధారణ రోజుల్లో ఆక్సిజన్ కొనుగోలు చేసే అవసరముండదని చెబుతున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది.


