భూపాలపల్లి అర్బన్: ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 12వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శనివారం ఉద్యోగులు ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని కోరారు. న్యాయం జరిగే వరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బడితల రమేశ్, ప్రధాన కార్యదర్శి మధు, ఇతర నాయకులు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, ఫార్మసీ అధికారులు పాల్గొన్నారు.
వేట సామగ్రి స్వాధీనం
మహాముత్తారం: మండలంలోని యామన్‌పల్లిలో అటవీ జంతువుల వేట సామగ్రితో పాటు ఓ వ్యక్తిని అటవీ శాఖ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కాటారం సీఐ బీమేశ్, మహాముత్తారం ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో మండలంలోని యామన్‌పల్లి గ్రామంలో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన దాగం మహేశ్ వద్ద అటవీ జంతువుల వేటకు వాడే ఇనుప తీగలు, వైర్లతో పాటు ఓ అటవీ జంతువు కొమ్ము లభ్యమైంది. దీంతో పోలీసులు వెంటనే అతడిని కాటారం అటవీశాఖ అధికారులకు అప్పగించారు. కాటా రం అటవీశాఖ అధికారులు నిందితుడిపై అటవీ హక్కుల చట్టం కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న సామగ్రితో పాటు అతడిని భూపాలపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు యామన్‌పల్లి డీఆర్‌ఓ ఝాన్సీరాణి తెలిపారు.
గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: అర్హులైన పట్టభద్రులందరూ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. శనివారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ పార్కులో వాకర్స్‌తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29వ వార్డులు, సుభాష్ కాలనీలో ఇంటింటికీ తిరుగుతూ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతీ పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
సకాలంలో వైద్యం
అందేలా పనిచేయాలి
భూపాలపల్లి అర్బన్: రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం రహత్ పథకం ద్వారా బాధితులకు సకాలంలో వైద్యం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ మాట్లాడారు. పథకం అమలుపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాలో పథకం అమలులో లోపాలు లేకుండా, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందేలా అన్ని శాఖ అధికారులు పని చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ వృథా చేస్తే చర్యలు
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఈ మేరకు శనివారం అన్ని శాఖల అధికారులకు సర్క్యులర్ జారీచేశారు. పగటిపూట సహజ వెలుతురును వినియోగించాలని, గదుల్లో ఎవరూ లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, కంప్యూటర్లు ఆఫ్ చేయాలని సూచించారు. ఏసీల ఉష్ణోగ్రతను 24–26 డిగ్రీల మధ్య ఉంచాలని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, వృథా గుర్తిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


