అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

Oct 25 2026 12:59 AM | Updated on Oct 25 2026 12:59 AM

కాళేశ్వరం: వచ్చే ఏడాది జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరంలో పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి కాళేశ్వరం క్షేత్రంలో పర్యటించి దేవాదాయ, నీటిపారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్‌ తదితర శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ హనుమంతరావు మాట్లాడుతూ అన్ని పనులను నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడొద్దని స్పష్టంచేశారు. అక్షరాభ్యాస మండపం, అద్దాల మండపం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రూపొందించిన ప్రణాళికకు, సంప్రదాయ వాస్తు నిబంధనలకు అనుగుణంగా జరగాలని, నిర్మాణాల్లో మార్పులు, వ్యత్యాసాలు చోటుచేసుకోకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి..

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కమిషనర్‌ హనుమంతరావు స్పష్టంచేశారు. ముఖ్యంగా కాంక్రీట్‌ పనుల్లో వైబ్రేటర్లను వినియోగించాలని, గోనె సంచులు, వరి గడ్డితో తగిన విధంగా వాటర్‌ క్యూరింగ్‌ చేపట్టాలని సూచించారు. ప్రతీ నిర్మాణాన్ని సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి పటిష్టంగా పూర్తిచేయాలని అధికారులకు తెలిపారు. వచ్చే నెల 4న మంత్రి శ్రీధర్‌బాబు కాళేశ్వరం పర్యటనకు రానున్న నేపథ్యంలో అప్పటిలోగా పనుల్లో గణనీయమైన పురోగతి సాధించాలన్నారు.

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు..

గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి అసౌకర్యం కలగకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్‌ హనుమంతరావు సూచించారు. తాగునీరు, రహదారులు, పార్కింగ్‌, వీఐపీ ఘాట్లు తదితర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలన్నారు. గత పుష్కరాల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.

పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం: కలెక్టర్‌

కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ కాళేశ్వరంలో ఆలయ పునర్నిర్మాణ పనులతో పాటు గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ పర్యటనలో కాటారం సబ్‌ కలెక్టర్‌ సౌరబ్‌ శర్మ, ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, దేవాదాయశాఖ ఎస్‌ఈ దుర్గాప్రసాద్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు, ఎస్‌ఈ రమేశ్‌బాబు, డీఈ దేవేందర్‌, ఈఓ మహేశ్‌, ఎంపీడీఓ రవీంద్రనాథ్‌, ధర్మకర్తలు గందెసిరి సత్యనారాయణ, సీతయ్య, పద్మ, దుర్గయ్య, అశోక్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

పుష్కర ఘాట్లు, దేవస్థానం పునర్నిర్మాణ పనులు గడువులోగా పూర్తిచేయాలి

నిర్మాణ పనుల నాణ్యతలో రాజీపడొద్దు

దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌

హనుమంతరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement