● మధ్యాహ్న భోజనానికి
సొంత తోటలే ఆధారం!
● కిచెన్ గార్డెన్లతో విద్యార్థులకు
శ్రమ విలువపై అవగాహన
ఎస్ఎస్తాడ్వాయి: పాఠశాలల్లో పెరటి తోటల పెంపకంతో విద్యార్థులకు ప్రకృతిపై అవగాహన కల్పించడంతోపాటు మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను సొంతంగా పండిస్తున్నారు. తాడ్వాయి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు విశేష స్పందన లభిస్తోంది. వర్షాకాలం ప్రారంభం నుంచే అన్ని పాఠశాలల్లో పెరటి తోటలు పెంచాలని మండల విద్యాధికారి గడ్డి శ్రీనివాస్ సూచనల మేరకు స్పందించిన ప్రధానోపాధ్యాయులు ఆ దిశగా కూరగాయాల సాగుకు చర్యలు చేపట్టారు.
పండిన కూరగాయలతోనే వంటలు
మండలంలోని లింగాల పాఠశాలలో పెరటి తోటల పెంపకం ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల ఆవరణలో గోంగూర, బీరకాయ, సోరకాయ, వంకాయ, టమాటా, ఉల్లిగడ్డలు సాగు చేస్తున్నారు. వీటితోనే మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు తాజా, నాణ్యమైన కూరలు వండిపెడుతున్నారు.
విద్యార్థులే సాగుదారులు
లింగాల, బోటిలింగాల, అంకంపల్లి, కోడిశాల, ఇంద్రానగర్, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాల తాడ్వాయి, ఊరట్టం, వెంగ్లాపూర్, ఎల్బాక పాఠశాలల్లో విద్యార్థులు స్వయంగా కూరగాయల మొక్కలు నాటడం, నీరు పోయడం, వాటిని సంరక్షించడం, పంట చేతికి వచ్చిన తర్వాత కూరగాయలను కోయడం వంటి పనుల్లో పాల్గొంటున్నారు. దీంతో వారికి మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెరగడంతోపాటు శ్రమపై గౌరవం అలవడుతుంది. విద్యార్థులను సాగు కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు.


