భూపాలపల్లి అర్బన్: తాడిచర్ల బొగ్గు బ్లాక్–2 పేరుతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేపడుతున్నది భరోసా యాత్ర కాదని.. అది కార్మిక నయవంచన యాత్ర అని ఐఎన్‌టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ జోగ బుచ్చయ్య విమర్శించారు. ఏరియా బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేటీకే 8వ గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌ను కార్మికులపై ప్రేమతో కాకుండా, న్యాయపరమైన చిక్కులను నివారించేందుకే సింగరేణికి కేటాయించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి నిజంగా సింగరేణిపై చిత్తశుద్ధి ఉంటే శ్రావణపల్లి, సత్తుపల్లి, కోయగూడెం, మణుగూరు తదితర బొగ్గు బ్లాకులను కూడా నేరుగా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ నాయకులు రఘుపతిరెడ్డి, శేషారత్నం, పసునూటి రాజేందర్, సదయ్య, కుడుదుల శంకర్, అప్పం రాములు, రాజు, రాములు పాల్గొన్నారు.


