మల్హర్: మండలంలోని కొండంపేట గ్రామ పంచాయతీ పరిధి గట్టుపల్లె గ్రామానికి చెందిన గోరేటి పార్వతి వృద్ధాప్య పింఛన్‌ను పునరుద్ధరించారు. ఫిబ్రవరి నుంచి ఐదు నెలలుగా పార్వతి పింఛన్ నిలిచిపోయింది. జూన్ 30న సాక్షిలో ‘నేను బతికే ఉన్నా..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు జూన్ నెలకు సంబంధించిన వృద్ధాప్య పింఛన్ డబ్బులు రూ.2016 పార్వతి ఖాతాలో వేశారు.
ఏఐటీయూసీ
పోరాట ఫలితమే
భూపాలపల్లి అర్బన్: సింగరేణికి తాడిచర్ల–2 ఓపెన్‌కాస్ట్ బ్లాక్ కేటాయించడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాట ఫలితమేనని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఏరియాలోని కేటీకే–6వ గనిలో నిర్వహించి విజయోత్సవ గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని తొలి నుంచే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. వెంకటాపురం (పీవీఎన్‌ఆర్) ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును కూడా సింగరేణికే కేటాయించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు నూకల చంద్రమౌళి, కృష్ణమూర్తి శ్రీనివాస్, రాజన్న, గణేష్, రాంబాబు, సత్యనారాయణ, వేణు, సిద్ధయ్య, శ్రీధర్, కనకయ్య, మధుకర్, కార్మికులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన
దేవస్థానం టెండరుదారులు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానంలో పలు దుకాణాల నిర్వహణ టెండరుదారులు మంత్రి శ్రీధర్‌బాబును హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. తమకు బాలాలయం వద్ద సరైన వసతులు లేక గిరాకీ కావడం లేదని టెండర్ కాలం పొడిగించాలని మంత్రితో వాపోయారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈఓ మహేష్‌కు ఫోన్ చేసి సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.
రాష్ట్రస్థాయికి ఎంపిక
మల్హర్: మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులు కొడారి యశస్విని, తేజస్వి రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. నేడు జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 18న మెదక్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే పోటీల్లో విద్యార్థినులు పాల్గొననున్నారు.
జూనియర్ లెక్చరర్ పోస్టుకు
దరఖాస్తుల ఆహ్వానం
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజీలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ (ఉర్దూ) పోస్టును కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారి కుమారస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టుకు పీజీ, బీఎడ్, టీజీ టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత విద్యార్హతల ధ్రువపత్రాల ప్రతులతో దరఖాస్తులను ఈనెల 22న సాయంత్రం నాలుగు గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 99891 62064 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
నేడు సీపీఐ(ఎం)
నాయకుల పర్యటన
కాళేశ్వరం: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ రావు నేడు (శనివారం) కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 8 గంటలకు అన్నారం బరాజ్, 10 గంటలకు కన్నేపల్లిలోని లక్ష్మీపంపుహౌస్, మధ్యాహ్నం 12 గంటలకు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించనున్నారు. అనంతరం మేడిగడ్డ వద్ద విలేకరుల సమావేశంలో పాల్గొననున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


