భూపాలపల్లి: నిండుకుండలా చెరువులు, ఉప్పొంగే వాగులు, వంకలు కనిపించే జిల్లాలో కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. తొలకరి కురిసిన వర్షాలకు పత్తి గింజలు నాటిన రైతులు మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తుండగా, మిర్చి, వరిసాగుపై నీలినీడలు కనిపిస్తున్నాయి.
పత్తి మొలకలు కాపాడుకునేందుకు పాట్లు..
జూన్ నెల చివరి వారంలో కురిసిన తొలకరి వర్షాలకు జిల్లాలోని 12 మండలాల్లో రైతులు సుమారు లక్ష ఎకరాలకు పైగా భూముల్లో పత్తిగింజలు నాటారు. సగం వరకు గింజలు మొలకెత్తాక వర్షాలు కురవలేదు. దీంతో రైతులు మళ్లీ పోగుంటలు(విత్తుకోని చోట గింజలు నాటడం) పెట్టారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ అప్పుడప్పుడు చిరుజల్లులు కురవడంతో గింజలు మొలకెత్తాయి. అనంతరం వర్షాలు మొఖం చాటేయడమే కాక గడిచిన వారం రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పత్తి మొలకలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. బోరు, బావుల నుంచి పైప్‌లైన్‌లు వేసి మొక్కలను నీరందిస్తున్నారు. వానల మీద ఆధారపడి సాగుచేసే వారు సమీప రైతులకు చెందిన బోర్లను గంటల చొప్పున అద్దెకు తీసుకొని మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
బోర్లు ఉన్న రైతులే మిర్చిసాగు..
వర్షాభావ పరిస్థితుల కారణంగా మిర్చిసాగు అంతంత మాత్రంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోర్లు ఉన్న వారే సాగు చేసేందుకు మిర్చి గింజలు పోయగా అవి నారు దశలో ఉన్నాయి. వర్షాలు కురవకపోతే భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో సైతం నీరు లేకుండా పోతుంది. ఫలితంగా మిర్చి పంటపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో రైతులు ఈ ఏడాది మిర్చి సాగుపై సందిగ్ధంగా ఉన్నారు.
అన్ని మండలాల్లో లోటు వర్షపాతమే..
ఈ ఏడాది జిల్లాలోని ప్రతీ మండలంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు వర్షపాతమే నెలకొంది. మల్హర్, చిట్యాల, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాల్లో 50 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. వరుసగా రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. దీంతో జలాశయాల్లో నీరు లేకపోవడమే కాక భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి.
పంటలు సాగు ఇప్పటివరకు
సాగు అంచనా సాగు
వరి 48,930 802
పత్తి 1,11,024 1,02,215
మొక్కజొన్న 150 44
కంది 100 65
పొద్దుతిరుగుడు 420 250
మిర్చి 12,000 నారుదశ
కూరగాయలు 100 100
పండ్ల తోటలు 1,100 1,048
ఆయిల్‌పామ్ 2,500 900
పసుపు 100 50
జిల్లాలో పంటల సాగు వివరాలు (ఎకరాల్లో)..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు
జిల్లాలో సగటున
40 శాతం లోటు వర్షపాతం
మొలకెత్తిన పత్తికి పరీక్ష
ముందుకు సాగని
వరి, మిర్చి పంటల సాగు
ఆందోళనలో అన్నదాతలు


