వైద్యకళాశాల భవనం పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యకళాశాల భవనం పనులు పూర్తి చేయాలి

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

భూపాలపల్లి: ఆగస్టు నెలాఖరు నాటికి వైద్యకళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి పూర్తిస్థాయిలో అప్పగించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో టీజీఎంఐడీసీతోపాటు వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. వైద్య కళాశాల నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోజువారీ ప్రగతిని సమీక్షిస్తూ ముందుకెళ్లాలని అధికారులకు తెలిపారు. అలాగే విద్యుత్‌, నీటి సరఫరా, అంతర్గత రహదారులు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను సమయానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అన్ని విభాగాల సమన్వయంతో పనులను త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హాస్టల్‌ నిర్మాణ పనులను సెప్టెంబర్‌ నెలాఖరు వరకు పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ రమేష్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం దేవస్థానం

టెండర్‌ మళ్లీ వాయిదా

కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ, అభివృద్ధిలో భాగంగా ఆలయాన్ని రాతితో నిర్మించడానికి రూ.198 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించింది. కాగా, కాళేశ్వరం దేవస్థానంలో జూన్‌ 17న శృంగేరి పీఠం శిష్య బృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆదిమక్తీశ్వరాలయంలో బాలాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుమార్లు టెండర్‌ ప్రక్రియ నిర్వహించేందుకు చర్యలు చేపట్టినా.. వాయిదా పడింది. ఇలా జూన్‌ 23న, ఈనెల 4, 8న వాయిదా వేశారు. 15న బుధవారం కూడా యాథావిధిగా వాయిదా పడినట్లు తెలిసింది. టెండర్‌లో పాల్గొనడానికి ఎవరూ రాలేదని సమాచారం. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేష్‌బాబును ఫోన్‌లో సంప్రదించగా మొదటి కాల్‌లో ఎవరూ రాలేదని, రెండో కాల్‌లో ఎప్పుడనేది చెబుతానన్నారు.

మాజీ మావోయిస్టుల

కార్యవర్గం ఎన్నిక

చిట్యాల: భూపాలపల్లి జిల్లా మాజీ మావోయిస్టులు బుధవారం మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా ఉద్యమంలో అమరులైన వారికి జోహార్లు అర్పించారు. అనంతరం మాజీ మావోయిస్టు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బండి కిష్టస్వామి, జిల్లా అధ్యక్షుడిగా కంకణాల శంకర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా దాసారపు రాధ, ఉపాధ్యక్షుడిగా బొమ్మకంటి రవి, ప్రధాన కార్యదర్శిగా పాశం పర్వతాలు, కోశాధికారిగా మాచర్ల రఘు, కార్యదర్శిగా లావుడ్య జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా జున్ను సదయ్య, లద్దునూరి ఐలయ్య, మండ రమేష్‌, దైనంపల్లి వెంకటేశ్వర్లు, ఆకునూరి భాగ్యలక్ష్మి, కచ్చు శ్రీనివాస్‌, రేహనాబేగం, చింతనిప్పుల రాజమణి, భద్రునాయక్‌, పున్నం రవి, బండి లలితను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కంకణాల శంకర్‌ మాట్లాడుతూ.. మాజీ మావోయిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేంత వరకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

నేటితో ముగియనున్న

సీపీగెట్‌

కేయూ క్యాంపస్‌: తెలంగాణలో తొమ్మిది యూనివర్సిటీలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న టీజీసీపీగెట్‌–26 బుధవారం కూడా రాష్ట్రంలో 22 పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్ట్‌ విధానంలో పరీక్షలు కొనసాగాయి. ఉదయం సెషన్‌లో ఎం కామ్‌, ఎమ్మెస్సీ బాటనీ కోర్సులకు 6,939 మంది అభ్యర్థులకు గాను 6,037 మంది అభ్యర్థులు హాజరైనట్లు టీజీసీపీగెట్‌ కన్వీనర్‌, కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాజేందర్‌ తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ కోర్సులకు 3,579 మంది అభ్యర్థులకుగాను 3,294 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. సాయంత్రం సెషన్‌లో నిర్వహించిన ఎంఏ ఇస్లామిక్‌ స్టడీస్‌ అండ్‌ హెచ్‌ఆర్‌ఏ కోర్సుకు 484 మంది అభ్యర్థులకుగాను 376 మంది హాజరైనట్లు రాజేందర్‌ వెల్లడించారు. ఈనెల 16న ఉదయం సెషన్‌లో ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సు ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. సుమారు 1300 మంది అభ్యర్థులు రాయబోతున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement