భూపాలపల్లి అర్బన్: భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీసర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఖమ్మం ఐడీఓసీ కార్యాలయం నుంచి భూ రీసర్వే, భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్ లోకేష్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహనిర్మాణ శాఖ డైరెక్టర్ వీపీ గౌతం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలపై ప్రత్యేక సమన్వయంతో ముందుకు సాగుతున్నామన్నారు. భూ రీసర్వేను నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్ పాల్గొన్నారు.


