భూపాలపల్లి అర్బన్: విద్యాసంస్థల బంద్ పిలుపు జిల్లాలో విజయవంతమైందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సొతుకు ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు బంద్‌కు సహకరించాయన్నారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్–టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ అంతరాయం
భూపాలపల్లి అర్బన్: విద్యుత్ సబ్‌స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా నేడు(శనివారం) జిల్లా కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు భూపాలపల్లి ఏఈ విశ్యాస్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూపాలపల్లి, జంగేడు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, జంగేడు సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: 2026–27 విద్యా సంవత్సరానికి బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు నూతన, రెన్యువల్‌కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ప్రొఫెషనల్, పీజీ, ఇతర అర్హత గల కోర్సులలో చదువుతున్న విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రూ.4 వేల సాయం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ–మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఇందిరా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి బీసీ విద్యార్థికి సంవత్సరానికి రూ.4వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులకు పథకం ప్రయోజనం అందేలా అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రోగులకు అందుబాటులో ఉండాలి
ఏటూరునాగారం: ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలను అందించాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని తనిఖీ చేశారు. మందుల నిల్వ గదులు, లేబర్ రూమ్, జనరల్ వార్డు, ఓపీ, మరుగుదొడ్లు, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది వస్తున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఆహారం అందిస్తున్నారా.. ఏమైనా సమస్యలున్నాయా.. అని తెలుసుకున్నారు. మాతాశిశు ఆస్పత్రిలోని పలు వార్డులను పరిశీలించారు.


