భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి కనీస వేతనాలు అమలుచేయాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ.. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం రూ.26 వేల వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, సంవత్సరం పాటు పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనంతో కూడిన బోనస్ ఇవ్వాలని కోరా రు. ప్రతి నెలా సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ కార్మికులు సంపత్, రాకేష్, సురేష్‌తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.


