కాళేశ్వరం: మహదేవపూర్ మండలం సూరారం, రాపల్లికోట గ్రామాల్లో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఏఓ శ్రీజ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియాను అధిక ధరలకు విక్రయించడం, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించకపోవడం, రైతులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సూరారంలోని సాయి ఫర్టిలైజర్స్ రూ.2.39 లక్షల విలువైన స్టాక్, రాపల్లికోటలోని డీసీఎంఎస్ దుకాణం రూ.1.47 లక్షల విలువైన స్టాక్‌లకు స్టాప్ సేల్ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు అందజేశారు. సూరారంలోని వినాయక ఫర్టిలైజర్స్ లైసెన్స్‌ను వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఏడీఏ హెచ్చరించారు. వారివెంట వ్యవసాయ విస్తరణ అధికారులు రచన, ధర్మేందర్ ఉన్నారు.
స్తంభంపల్లి గ్రామంలో..
మహాముత్తారం: మండలంలోని స్తంభంపల్లి(పీకే) గ్రామంలోని శ్రీరామ ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ ఎరువుల దుకాణాన్ని మండలవ్యవసాయ అధికారి అనూష తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఫెర్టిలైజర్ యాక్ట్ 1985నిబందనలను ఉల్లంఘించినట్లు బయటపడింది. దీంతో ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు ఎరువుల క్రయవిక్రయాలు జరుపరాదని ఫెర్టిలైజర్ యాజమాని శ్రీనివాస్‌కు సూచించారు.


