
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: మధ్యాహ్న భోజన వర్కర్స్ పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు వారి సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ధర్నా చేపట్టి, వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. ఈసందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం రూ.10వేలు ఇవ్వాలని, కేంద్రం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మికులు స్వర్ణలత, సంపూర్ణ, లావణ్య, లక్ష్మి, సుగుణ, పద్మ, మణెమ్మ, కమల, భారతి పాల్గొన్నారు.