
భద్రత, బందోబస్తు కోసమే ఆన్‌లైన్ నమోదు
● గణేష్ మండపాల నిర్వాహకులు
నిబంధనలు పాటించాలి
● ఎస్పీ కిరణ్ ఖరే
భూపాలపల్లి: భద్రత, బందోబస్తు కోసమే పోలీసుశాఖ ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వహణకు సంబంధించిన ఆన్‌లైన్ నమోదు చేస్తున్నట్లు ఎస్పీ కిరణ్ ఖరే గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ సమాచారం ఇవ్వడానికి రుసుం లేదన్నారు. మండపాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తప్పకుండా సమాచారం ఇవ్వాలని, పోలీస్ పోర్టల్‌లో వివరాలు పొందుపరచాలని తెలిపారు. మండపాల నిర్వాహకులు తప్పకుండా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజా రవాణాకు, ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద షాట్ సర్క్యూట్ జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డీజేలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. పోలీసుశాఖకు సహకరిస్తూ ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.